కరీంనగర్: కాళేశ్వరం  ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగు నీటిని  అందిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ నది ద్వారా 400 టీఎంసీల నీటిని వాడుకొంటామని ఆయన చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురిలో లక్ష్మీనరసింహాస్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు సందర్శించుకొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

భవిష్యత్ కోసం శాశ్వత మంచినీటి వనరులను సమకూరుస్తున్నట్టుగా కేసీఆర్  ప్రకటించారు.  మిషన్ భగీరథ పనులను పరిశీలించేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుండి అధికారులు, మంత్రులు వస్తున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.

మరో నెల రోజుల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి కానున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడ అమలు చేయడం లేదన్నారు. 

ఒడిశా రాష్ట్రంలో  రైతు బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి స్పూర్తిగా తీసుకొని అమలు చేస్తున్నట్టుగా ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ మీడియా ముందు ప్రకటించిన  విషయాన్ని  ఆయన గుర్తు చేశారు.

తుపాకులగూడెం, దుమ్ముగూడెం ప్రాజెక్టులు కూడ త్వరలోనే పూర్తి కానున్నట్టుగా సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల 100 కి.మీ. దూరంలో గోదావరి నీటిని ఒడిసిపట్టుకొనే అవకాశం ఉందన్నారు. 

44 ఏళ్ల సీడబ్ల్యూసీ లెక్కల ఆధారంగా  ఈ ప్రాజెక్టును డిజైన్ చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు. ఎల్లంపల్లి నుండి ప్రతి రోజూ మల్లన్నసాగర్ కు 2 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు.

మిడ్ మానేర్, లోయర్ మానేర్  డ్యామ్ లు ఇక ఎండిపోయే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు.  400 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రతి ఏటా రూ. 4992 కోట్లు ఖర్చు అవుతోందని  కేసీఆర్ చెప్పారు. 

దేవాదుల ద్వారా 75 టీఎంసీలు,దుమ్ముగూడెం ద్వారా 100 టీఎంసీలను వాడుకొంటామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోటీన్నర ఎకరాలకు నీరివ్వనున్నట్టు ఆయన చెప్పారు.