మరో రెండు రోజుల్లో బీజేపీ తొలి జాబితా: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా రెండు రోజుల్లో విడుదల కానుందని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తెలిపారు.
న్యూఢిల్లీ:మరో రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టుగా బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.శుక్రవారంనాడు డాక్టర్ లక్ష్మణ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లను కేటాయించనున్నట్టుగా లక్ష్మణ్ చెప్పారు. ఈ దిశగా పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుందన్నారు. తొలి జాబితాను రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.తమ జాబితాలో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయిస్తామని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు బీసీలకు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శించారు.
ఈ రెండు పార్టీలు బీసీలకు ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను తమ పార్టీ కేటాయించనుందన్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్,కాంగ్రెస్, ఎంఐఎం పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు.బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రాహుల్ గాంధీ విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ బీఆర్ఎస్, బీజేపీ ఎప్పుడూ కలిసి పనిచేయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు.అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అగ్రనేతలతో బీజేపీ నేతలు నిన్నటి నుండి ఢిల్లీలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ తదితరులు నిన్ననే న్యూఢిల్లీకి చేరుకున్నారు. పార్టీ అగ్రనేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ పార్టీ ఇంచార్జీ ప్రకాష్ జవదేకర్ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఇతర విషయాలపై చర్చించారు.
also read:ఓటుకు నోటు కేసుపై విచారణ ఎందుకు ఆగింది: రాహుల్ కు కిషన్ రెడ్డి కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహుల నుండి బీజేపీ ధరఖాస్తులను ఆహ్వానించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా ధరఖాస్తులు అందాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి అత్యధికంగా 66 ధరఖాస్తులు వచ్చాయి.ఈ దఫా జరిగే తెలంగాణ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పట్టుదలగా ఉంది. ఈ దిశగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తుంది.