సీపీఐ, సీపీఎం పార్టీలు ఇవాళ సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్న 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించడంపై  లెఫ్ట్ పార్టీలు అసంతృప్తితో ఉన్నాయి.  


హైదరాబాద్: కాంగ్రెస్ తమకు శత్రువేం కాదని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో పొత్తు ఉండదని కేసీఆర్ చెప్పకనే చెప్పారు. ఈ విషయమై సీపీఎం, సీపీఐ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు.తమతో మాట కూడ చెప్పకుండా కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించడాన్ని తమ్మినేని వీరభద్రం తప్పు బట్టారు. తెలంగాణలో కలిసి వచ్చే రాజకీయ శక్తులతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు.

ఉభయ కమ్యూనిష్టు పార్టీలు ఒకే విధానంతో ముందుకు వెళ్లనున్నట్టుగా ఆయన తేల్చి చెప్పారు. పొత్తుతోనే కాదు, తమ విధానంతో కూడ కేసీఆర్ విబేధించినట్టుగా తేలిందని తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. మంగళవారంనాడు ఓ తెలుగు న్యూస్ చానెల్ తో తమ్మినేని వీరభద్రం మాట్లాడారు.

మునుగోడు ఉప ఎన్నికల్లోనే కాదు రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీలతో తమ పొత్తు కొనసాగుతుందని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు. అయితే ఇవాళ కేసీఆర్ వైఖరి అవకాశవాదాన్ని తెలుపుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉభయ కమ్యూనిష్టు పార్టీలకు సీట్ల కేటాయింపు విషయమై కేసీఆర్ తో అధికారికంగా చర్చలు జరగలేదని ఆయన చెప్పారు. మధ్యవర్తులు తమతో మాట్లాడారన్నారు. కేసీఆర్ అభిప్రాయంగా ఉభయ కమ్యూనిష్టు పార్టీలకు ఒక్కో సీటు కేటాయించాలని కేసీఆర్ అభిప్రాయంగా ఉందని మధ్యవర్తులు చెప్పారని తమ్మినేని వీరభద్రం తెలిపారు. కేసీఆర్ తో తమకు చర్చలకు సమయం కేటాయించాలని కోరినా కూడ బీఆర్ఎస్ నాయకత్వం నుండి సానుకూలమైన స్పందన రాలేదని తమ్మినేని వీరభద్రం గుర్తు చేశారు.

మునుగోడు సీపీఐ, భద్రాచలం సీపీఎంకు ఇస్తామన్నారు.ఈ విషయమై కేసీఆర్ తో చర్చించాలని కోరినా ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా వ్యవహరిస్తాయని తమ్మినేని వీరభద్రం చెప్పారు. కేసీఆర్ తో తాము స్నేహం చేసిన సమయంలో కూడ ఈ విషయం చెప్పామని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

also read:బీఆర్ఎస్, లెఫ్ట్ మధ్య పొత్తుకు బ్రేక్:కొత్త పొడుపులు పొడిచేనా?

ఈ పరిణామాలపై తమ పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మరో వైపు ఈ విషయమై సీపీఐ రాష్ట్ర నేతలతో కూడ చర్చిస్తామని తమ్మినేని వీరభద్రం తెలిపారు