తెలంగాణలో విజయం మనదే: అభ్యర్థులతో కేసీఆర్
ఈ ఎన్నికల్లో తెలంగాణలో మళ్లీ విజయం సాధిస్తామని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో మళ్లీ విజయం మనదేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు అభ్యర్థులతో భేటీ అయ్యారు. ఇప్పటికే 115 స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుండి మైనంపల్లి హన్మంతరావుకు బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. అయితే మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ ను వీడారు. దీంతో మరో ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను కేసీఆర్ ఇవాళ ప్రకటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ ఇవాళ బీ ఫారాలను అందిస్తారు. ఆ తర్వాత ఎన్నికల మేనిఫెస్టోను సీఎం విడుదల చేయనున్నారు.
వేములవాడలో న్యాయపరమైన ఇబ్బందులతో ఆ స్థానంలో అభ్యర్ధిని మార్చాల్సి వచ్చిందని సీఎం కేసీఆర్ చెప్పారు. టిక్కెట్లు దక్కని వారు ఇబ్బంది పడొద్దని సీఎం కేసీఆర్ సూచించారు. అసంతృప్తి చెందినవారిని పార్టీ నేతలు వారితో మాట్లాడాలని సీఎం కేసీఆర్ కోరారు. సీట్లు రాని వారికి అనేక అవకాశాలుంటాయన్నారు. గతంలో జూపల్లి కృష్ణారావుకు తాము చేసిన సూచనను పట్టించుకోలేదన్నారు.దీంతో జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.కార్యకర్తల నుండి నేతల వరకు అందరిని సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్ధుబాటు చేసుకోవాలన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలవలేక కుయుక్తులను పన్నుతున్నారని కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. కోపతాపాలను అభ్యర్థులను పక్కన పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు.అఫిడవిట్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.సాంకేతికంగా దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారన్నారు.వనమా నాగేశ్వరరావు, కృష్ణమోహన్ రెడ్డి లపై ఇటీవల వచ్చిన హైకోర్టు తీర్పుల విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఎన్నికల వేళ అభ్యర్థులకు ఓపిక, సంయమనం అవసరమన్నారు.
ఇవాళ 51 మందికి బీ ఫామ్ లు అందిస్తామన్నారు. మిగిలిన అభ్యర్ధులకు రెండు రోజుల్లో మిగిలినవారికి బీ ఫారాలు అందిస్తామన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్ధులను మార్చాల్సి వచ్చిందని కేసీఆర్ చెప్పారు. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అజాగ్రత్తగా వ్యవహరించవద్దని కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సూచించారు. పార్టీ న్యాయ విభాగానికి చెందిన భరత్ కుమార్ ను సంప్రదించాలని కేసీఆర్ పార్టీ అభ్యర్థులను కోరారు.
ఎమ్మెల్యే అభ్యర్ధులు తమ కోపతాపాలు పక్కన పెట్టాలని కేసీఆర్ సూచించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసే కార్యకర్తలు అసంతృప్తులకు గురైతే వారిని బుజ్జగించాలని కేసీఆర్ కోరారు. అన్ని విషయాలు తమకే తెలుసుననే భావనను వీడాలన్నారు. నామినేషన్లను చివరి నిమిషంలో దాఖలు చేయవద్దని కూడ కోరారు. నామినేషన్ ఫారం నింపే సమయంలో న్యాయ సలహాలు తీసుకోవాలని సీఎం పార్టీ అభ్యర్థులను కోరారు.