హైదరాబాద్: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని  తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. 

టీఆర్ఎస్ భవన్ లో గురువారం నాడు జరిగిన  తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం నుండి పలువురు నేతలు తెలంగాణ  విద్యుత్ కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా  నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కరెంట్ కష్టాలు అందరికీ తెలిసిందేనని ఆయన చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని పార్లమెంట్ లోనే కేంద్రం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కూడ రికార్డు స్థాయిలో  పూర్తి చేసి నీటిని అందిస్తున్నట్టుగా చెప్పారు.  సాగు, తాగునీటితో విద్యుత్ రంగాలపై కేసీఆర్ కేంద్రీకరించినట్టుగా ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుండి ఇవాళ్టికి విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయన్నారు. విద్యుత్ కష్టాల నుండి మిగులు విద్యుత్ గల రాష్ట్రంగా తెలంగాణ చేరుకొందని ఆయన తెలిపారు. 

ఆరున్నర ఏళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని  కేటీఆర్ గుర్తు చేశారు.  రాష్ట్రంలో జరిగిన అభివృద్దిని గుర్తించకుండా విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు.