అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీసీలను కాంగ్రెస్, బీఆర్ఎస్ లు మోసం చేశాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు.ఆదివారంనాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు.దమ్ము, ధైర్యం కలిగిన పార్టీ బీజేపీ అని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సత్తా ఉన్న పార్టీ బీజేపీయేనని ఆయన తెలిపారు. మొదటి ఐదేళ్లు కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలు లేరన్నారు. బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ దేనని ఆయన చెప్పారు.
ఎంఐఎం వల్ల గ్రేటర్ లో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఆయన ప్రకటించారు. తొలి నుండి సామాజిక న్యాయం చేసే పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీయేనని ఆయన ప్రస్తావించారు.
తెలంగాణలో అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్య నాథ్ సర్కార్ ఏ రకంగా మాఫియాపై ఉక్కుపాదం మోపుతుందో తెలంగాణలో కూడ అదే పద్దతిని అవలంభిస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేపడితే బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీఎం పదవిని కట్టబెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 27న సూర్యాపేటలో జరిగిన సభలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని జనాబాాలో 50 శాతం కంటే ఎక్కువగా బీసీ జనాభా ఉంది. దీంతో బీసీ సామాజిక వర్గం ఓట్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీసీ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది.
2014 ఎన్నికల్లో కూడ టీడీపీకి అధికారాన్ని కట్టబెడితే బీసీని సీఎం చేస్తామని ఆనాడు చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారు.ఈ దఫా బీజేపీ ప్రయోగించిన బీసీ అస్త్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి,
తెలంగాణలో మూడో దఫా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తుంది. తెలంగాణ ఏర్పాటు చేసిన రెందు దఫాలు అధికారానికి కాంగ్రెస్ దూరంగా ఉంది. ఈ దఫా అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది.