Hyderabad: తెలంగాణలోని సమస్యలపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోరాటం, నిబద్ధతకు కేసీఆర్ భయపడుతున్నందునే పదేపదే ఆమెను టార్గెట్ చేస్తున్నారని పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆరోపించింది. నిరుద్యోగుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా, అహంకారపూరితంగా వ్యవహరించడమే కాకుండా, పోరాడే, నిరసన తెలిపే తమ హక్కును కూడా హరిస్తున్నదని మండిపడింది.
YSRTP President Y.S. Sharmila: నిరుద్యోగుల సమస్యలపై హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద వైఎస్‌ఆర్‌టీపీ ఒక రోజు నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఇదివరకు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన 'తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేస్ అండ్ ఎంప్లాయిమెంట్' (టీ-సేవ్) పేరుతో ఈ నెల 17న నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నిరసనకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షర్మిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే దీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు.. దీక్షలో 500 మందికి మించి పాల్గొనరాదని ఆదేశించింది.
దీక్షకు 48 గంటల ముందు పోలీసులను ఆశ్రయించాలని నిర్వాహకులకు సూచించింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో షర్మిల నిరసన దీక్షకు సంబంధించి కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఇదే విషయం గురించి ఆమె తాజాగా స్పందిస్తూ.. "T-SAVE ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం తలపెట్టిన దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం. నియంత కేసీఆర్ ప్రశ్నించే గొంతుకల్ని అణగదొక్కాలని చూసినా న్యాయం బతికే ఉంది అనడానికి ఈ తీర్పు నిదర్శనం. దీక్షా తేదీని త్వరలోనే వెల్లడిస్తాం. 1.91లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరాడుతామంటూ" పేర్కొన్నారు.
కాగా, పోలీసులు అనుమతి నిరాకరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్మార్గమైన పాలన, తన వైఫల్యాలు, బూటకపు హామీలపై గళమెత్తిన వారిపై నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అంతకుముందు మండిపడింది. టీ-సేవ్ నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించాలని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పోలీసులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ పార్టీ కార్యాలయంలోకి కార్యకర్తలను అనుమతించకపోవడం సిగ్గుచేటని వైఎస్‌ఆర్‌టీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు.
తెలంగాణలోని సమస్యలపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పోరాటం, నిబద్ధతకు కేసీఆర్ భయపడుతున్నందునే పదేపదే ఆమెను టార్గెట్ చేస్తున్నారని పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఆరోపించింది. నిరుద్యోగుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నామని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా, అహంకారపూరితంగా వ్యవహరించడమే కాకుండా, పోరాడే, నిరసన తెలిపే తమ హక్కును కూడా హరిస్తున్నదని మండిపడింది. టీ-సేవ్ ను ఉమ్మడి వేదికగా ప్రతిపాదించామనీ, ఇందిరాపార్కు సమీపంలో ఒక రోజు నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించామన్నారు. "ఈ పిటిషన్ ను నగర పోలీసులు తిరస్కరించారు. ప్రజా ఉద్యమాలకు, ప్రజా నిరసనలకు తమ ఆవిర్భావం, ఉనికి అని చెప్పుకునే పార్టీ ఇలా చేయడం సమంజసమేనా? గతంలో ఇందిరాపార్కు వద్ద కేసీఆర్ అనేక ఆందోళనలు చేయలేదా? బీఆర్ఎస్, ఇతరులకు నిబంధనలు ఎలా భిన్నంగా ఉంటాయి?" అని రామచంద్రరావు ప్రశ్నించారు. ప్రతిపాదిత నిరాహార దీక్షకు 39 సామాజిక సంస్థలు, వివిధ రాజకీయ పార్టీల మద్దతు ఉందని ఆయన పేర్కొన్నారు.
