నాతో పాటు కేసీఆర్ పై కూడా కేసులున్నాయి నిరుద్యోగులు వారి ప్రణాళికప్రకారమే వస్తారు నిన్నటి నుంచే అరెస్టులు మొదలయ్యాయి

తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించతలపెట్టిన ర్యాలీ అనుకున్న ప్రకారం చేసి తీరుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. ఎవరు బెదిరించినా వెనక్కి తగ్గేది లేదన్నారు.

ఉద్యమసమయంలో నాతో పాటు సీఎం కేసీఆర్ పై కూడా అనేక కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పోలీసులు హింసాత్మకంగా చిత్రీకరించడం దారుణమన్నారు.

ర్యాలీకి వచ్చే వాళ్లను అరెస్టు చేస్తే అక్కడే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు.

నిన్నటి నుంచే టీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, ఇప్పటి వరకు 600 మందిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలోప్రజాస్వామ్య పాలన కనిపించడం లేదని వాపోయారు.

ముందుగా అనుకున్న ప్రకారమే ఇందిరా పార్కు నుంచి సుందరయ్య భవన్ వరకు ర్యాలీని నిర్వహించితీరుతామని నిరుద్యోగులు వారి ప్రణాళిక ప్రకారమే ర్యాలీకి చేరుకుంటారని తెలిపారు.

ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమాన్నే పోలీసులు తప్పుపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.

ఎవరికి తెలియన నాగోలు మెట్రో స్థలంలో సభ నిర్వహించుకోమని కోర్టు చెప్పడం తమకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని అన్నారు.

దీన్ని నిరసిస్తూనే కోర్టులో తమ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు.