వచ్చే ఎన్నికల్లో నా అనుచరులంతా పోటీ: ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలనం
సమయం వచ్చినప్పుడు అన్నీ విషయాలను చెబుతానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ తన క్యాంప్ కార్యాలయంలో ఆయ న ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఖమ్మం: వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తన క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారంనాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తామంతా బీఆర్ఎస్ లో ఉన్నామన్నారు. బీఆర్ఎస్ లో తనకు దక్కిన గౌరవం ఎమిటో మీకు తెలుసునన్నారు. అనుచరులతో భేటీకి ఇది రాజకీయ వేదిక కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కానీ, భవిష్యత్తులో అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్టుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ప్రజల ఆదరాభిమానాలు ఉన్న నాయకుడు ప్రజా ప్రతినిధి కావాల్సిన అవసరం ఉందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలా జరిగినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. మిగిలిన విషయాలను సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తన అనుచరులు ఏం కోరుకుంటున్నారో అది చేసి చూపిస్తానని ఆయన ప్రకటించారు.
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, లు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. తన క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తన స్వగ్రామం బారెగూడెంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
also read:ఖమ్మంలో వేడేక్కిన రాజకీయం: పోటాపోటీగా బీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనాలు
2014 ఎన్నికల్లో ఖమ్మం నుండి వైసీపీ నుండి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాలతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు. టీడీపీలో టీఆర్ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఇస్తారని ప్రచారం సాగినా ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. కొంత కాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. కానీ గత ఏడాది డిసెంబర్ చివర్లో పొంగులేటి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇవాళ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో తన అనుచరులు కూడా పోటీచేస్తారని ఆయన ప్రకటించారు.