హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ స్పష్టం చేశారు.  కాంగ్రెస్ పార్టీలో టీజేఎస్  విలీనం అవుతుందనే ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆగష్టు మాసంలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. పార్టీని బలోపేతం చేసే విషయమై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు.

హైదరాబాద్:హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.ఆదివారం నాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.టీజేఎస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని దుష్ర్పచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ లో టీజేఎస్ విలీనం చేయబోమన్నారు. టీఆర్ఎస్ ఈ తప్పుడు ప్రచారానికి తెరతీసిందన్నారు. స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయే రాజకీయాలు టీఆర్ఎస్ చేయదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై అన్నిఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు.

టీజేఎస్ పని విధానాన్ని పార్టీ కమిటీలో సమీక్షించనున్నామన్నారు. పార్టీ నిర్మాణ లోపాలను గుర్తించి బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రజా సంంఘాల నుండి రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది ఆగష్టు మాసంలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.

నిరుద్యోగం, పోడు భూములు, ప్రజా సమస్యలపై పోరాటం నిర్వహిస్తామని కోదండరామ్ చెప్పారు. డబ్బులతో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.ఏపీతో తెలంగాణ ప్రభుత్వం కుమ్మక్కై నీటి పంచాయితీపై నాటకాలాడుతోందన్నారు. ఆషాడమాసం బోనాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు.