సంగారెడ్డి జిల్లా  పరిధిలో సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద  సుమారు మూడు లక్షలకు పైగా ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. 

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా ప‌రిధిలో సంగ‌మేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం (sangameshwara lift irrigation)కింద 2 ల‌క్ష‌ల 19 వేల ఎక‌రాల‌కు, బ‌స‌వేశ్వ‌ర ఎత్తిపోత‌ల ప‌థ‌కం (basaveshwara lift irrigation) కింద ఒక ల‌క్షా 65 వేల ఎక‌రాల‌కు సాగునీరు అందించ‌డం జ‌రుగుతోంద‌ని మంత్రి హ‌రీశ్‌రావు (harish rao)తెలిపారు. సంగ‌మేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్యయం రూ. 2,653 కోట్లు, బ‌స‌వేశ్వ‌ర ప్రాజెక్టు అంచ‌నా వ్య‌యం రూ. 1,774 కోట్ల‌తో నిర్మిస్తామ‌ని తెలిపారు.

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల (telangana Assembly session)సంద‌ర్భంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి హ‌రీశ్ రావు స‌మాధానం ఇచ్చారు. కొన్ని ద‌శాబ్దాల క‌ల నెరవేరనుందని ఆయన చెప్పారు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్నారు.


జ‌హీరాబాద్‌, ఆందోల్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలోని 11 మండ‌లాల‌కు సంగ‌మేశ్వ‌ర లిఫ్ట్ కింద సాగునీరు అందించేలా ప్రణాళికలు రూపొందించినట్టుగా మంత్రి అసెంబ్లీలో వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 231 గ్రామాల‌కు సాగునీరు వ‌స్తుంద‌న్నారు. ఈ ప్రాజెక్టుకు 12 టీఎంసీల నీటిని సింగూరు ద్వారా ఎత్తిపోస్తాం. 3 పంప్ హౌజ్‌లు, 6 ప్ర‌ధాన కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి వివరించారు.

బ‌స‌వేశ్వ‌ర లిఫ్ట్ కింద నారాయ‌ణ్‌ఖేడ్‌, ఆందోల్ నియోజ‌వ‌ర్గాల్లోని 8 మండ‌లాలు, 166 గ్రామాల‌కు సాగునీరు అందిస్తామన్నారు. 8 టీంఎసీల నీటిని సింగూరు నుంచి ఎత్తిపోస్తాం. 2 పంప్ హౌజ్‌లు, 6 ప్ర‌ధాన కాలువ‌ల ద్వారా సాగునీరు అందిస్తాం. ఒక‌ట్రెండు మాసాల్లోనే టెండ‌ర్ల ప్ర‌క్రియ పూర్తి చేసి ఈ ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న చేస్తామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.