హైదరాబాద్: రెండు రోజుల్లో దుబ్బాక అసెంబ్లీ స్ధానం నుండి పోటీ చేసే అభ్యర్ధి పేరును ప్రకటిస్తామని  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తెలిపారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక బిల్లులకు పరోక్షంగా టీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన రైతు చట్టాలను నిరసిస్తూ ఈ నెల 2వ తేదీన సంగారెడ్డిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవరాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పాల్గొంటారని  ఆయన తెలిపారు. 

also read:దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు: కాంగ్రెస్ ప్లాన్ ఇదీ....

దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది నవంబర్ 3 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది.ఆగష్టు 5వ తేదీ రాత్రి దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు.

 దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రామలింగారెడ్డి సతీమణి సుజాతకు ఈ స్థానం నుండి టీఆర్ఎస్ బరిలోకి దింపే అవకాశం ఉందని చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ స్థానంనుండి బరిలో దింపే అభ్యర్ధి కోసం వేట సాగిస్తోంది. దామోదర రాజనర్సింహ భార్యను ఈ స్థానం నుండి బరిలోకి దింపుతారనే ప్రచారం సాగుతోంది.