హైదరాబాద్: దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది.ఈ ఉప ఎన్నికల్లో తన సత్తాను చాటాలని  ఆ పార్టీ భావిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర పార్టీ నేతలతో  మాణికం ఠాగూర్ ఆదివారం నాడు చర్చించారు.

త్వరలోనే దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేయనుంది. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తున్నారు.  

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా మాణికం ఠాగూర్ నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయన శనివారం నాడు హైద్రాబాద్ కు వచ్చారు. పార్టీ నేతలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఇవాళ ఉదయం దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. 

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలోని 146 గ్రామాల్లో ప్రతి రెండు గ్రామాలకు ఒక్క ముఖ్యనేతను ఇంఛార్జీగా నియమించనుంది కాంగ్రెస్. ఏ మండలాలకు ఒక ముఖ్యనేతను ఇంఛార్జీగా నియమించనున్నారు. 

రెండు మూడు రోజుల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్ధి ఎంపిక కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కూడ పార్టీ నేతలతో ఠాగూర్ చర్చించారు.

also read:రంగంలోకి హరీష్ రావు: దుబ్బాకలో వార్ వన్ సైడేనా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పోటీ పడుతున్న అభ్యర్ధుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసి ఇవ్వాలని ఠాగూర్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు. 

దుబ్బాక ఉప ఎన్నికలపై కేంద్రీకరించి పనిచేయాలని ఠాగూర్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై కూడ పార్టీ నేతలతో చర్చించారు.