సిద్దిపేట: ఎన్నికల నిబంధనల ప్రకారమే తాము పనిచేస్తున్నామని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ చెప్పారు.

సిద్దిపేటలో అంజన్ రావు ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపాయి. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లో ధర్నాకు దిగాడు.

also read:నగదు ఎత్తుకెళ్లిన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తాం: సీపీ జోయల్ డేవిస్

సిద్దిపేట సీపీపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై సీపీ స్పందించారు.సోమవారం నాడు సిద్దిపేటలో జరిగిన ఘటనపై ఎన్నికల కమిషన్ కు, డీజీపీకి నివేదిక పంపినట్టుగా ఆయన చెప్పారు. 

ఎన్నికల అధికారుల మీద దాడి చేసి డబ్బులు లాక్కెళ్లిన ఏడుగురిని అదుపులోకి తీసుకొన్నామని ఆయన వివరించారు.తాము ప్రభుత్వం కింద పనిచేయడం లేదన్నారు. ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.3 ప్లాటూన్ల కేంద్ర బలగాలను రప్పించినట్టుగా ఆయన తెలిపారు. పరిస్థితిని బట్టి ముందే బలగాలను  దించామన్నారు.

పోలీసుల మీద బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఆయన తేల్చిపారేశారు. సోదాలు నిర్వహించే సమయంలో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అక్కడే ఉన్నాడని ఆయన చెప్పారు.

పోలీసుల మీద నమ్మకం లేకపోతే కలెక్టర్ కు, ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేయవచ్చని సీపీ సూచించారు.డబ్బులు పంపిన వ్యక్తితో పాటు డబ్బులు పంచిన వ్యక్తిపై కేసులు పెట్టామని ఆయన చెప్పారు. 

సీజ్ చేసిన డబ్బును లాక్కెళ్లిన ఘటనపై మరో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.సురభి అంజన్ రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో  డబ్బులు దొరికినట్టుగా సీపీ వివరించారు.


తాము పారదర్శకంగానే పనిచేస్తున్నామన్నారు సీపీ.డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయో ఆడియో, వీడియోలు కూడ ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రచారానికి వచ్చే వాళ్లను ఎవరిని కూడ అరెస్ట్ చేయలేదని ఆయన చెప్పారు. సోదాలు చేసే సమయంలో ఎవరి పట్ల కూడ అనుచితం ప్రవర్తించలేదని ఆయన వివరణ ఇచ్చారు. ఇక్కడి పరిస్థితి బాగోలేదని బండి సంజయ్ కు చెప్పామని ఆయన తెలిపారు.  శాంతి భద్రతల సమస్య కారణంగానే ఆయనను గౌరవంగానే పంపామని సీపీ చెప్పారు. ఈ డబ్బులు తాము పెట్టామని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.