కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ యాసంగి ధాన్యం కొనుగోలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. దేశమంతటా కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణ నుంచి ఎందుకు సేకరించం అని ప్రశ్నించారు. అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరని అడిగారు.
న్యూఢిల్లీ: వరి ఉరి ఎపిసోడ్ మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏకంగా కేంద్రంపై యుద్ధమే ప్రకటించారు. తాజాగా, ఈ ఎపిసోడ్‌లో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి రా రైస్ కొనబోమని ఎవరు చెప్పారని, అన్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణ నుంచి ఎందుకు సేకరించం అని ఎదురు ప్రశ్నించారు. పార్లమెంటులో తెలంగాణ బీజేపీ నేతలతో ఆయన సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావులు పార్లమెంటులో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పియూశ్ గోయల్‌తో సమావేశం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేసీఆర్ ప్రభుత్వం ఆరోపణలు గుప్పిస్తున్నదని, రైతు ప్రయోజనాలను కేంద్రం పాతర పెట్టిందని దుష్ప్రచారం చేస్తున్నదని కేంద్రమంత్రికి తెలిపారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి పియూశ్ గోయల్ మండిపడ్డారు.
రా రైస్ కొనబోమని ఎవరు చెప్పారని కేంద్ర మంత్రి ఎదురు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరిస్తున్నప్పుడు ఒక్క తెలంగాణలో మాత్రమే ఎందుకు కొనుగోలు చేయం అని అడిగారు. అసలు ఈ విషయాలపై పార్లమెంటు సాక్షిగా గతంలోనే స్పష్టత ఇచ్చామని వివరించారు. యాసంగి సీజన్‌లోనూ తెలంగాణ నుంచి తప్పకుండా రా రైస్ కొంటామన్నామని తెలిపారు. కానీ, దానికి తెలంగాణ ప్రభుత్వమే సహకరించడం లేదని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన బియ్యమే ఇంకా అప్పగించలేదని తెలిపారు. ఇదిలా ఉండగా, ఇక నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసిందని తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ స్పష్టం చేశారు.
ఈ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రా రైస్ కొనడానికి సిద్ధంగా ఉన్నదని కేంద్ర మంత్రి పియూశ్ గోయల్ స్పష్టం చేశారని వివరించారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని అన్నారు. రాజకీయ లబ్ది కోసం కేవలం బీజేేపీని బద్నాం చేయడమే ఆయన ప్రభుత్వం పనిగా పెట్టుకున్నట్టు ఉన్నదని ఆరోపించారు.
