మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2కి సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపు 24 గంటల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. 

హైదరాబాద్‌‌లో (hyderabad) మంచి నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. నగరంలోని పలు ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -2కి (manjeera water supply scheme phase 2) సంబంధించి పటాన్‌చెరు నుంచి హైదర్‌గూడకు ఉన్న 1500 ఎంఎం డయా పంపింగ్ మెయిన్ పైప్‌కు ఏర్పడ్డ లీకేజీల నివారించేందుకు ఆర్‌.సి పురంలోని లక్ష్మీ గార్డెన్, మదీనాగూడలోని సుమన్ కాలేజీ వద్ద మరమ్మత్తు పనులను అధికారులు (jalamandali) చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు వరకు దాదాపు 24 గంటలపాటు పనులు కొనసాగనున్నాయి. దీంతో మంజీరా వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ – 2 కింద ఉన్న రిజర్వాయర్ల పరిధిలో ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు 
బీరంగూడ, అమీన్‌పూర్, ఆర్.సి.పురం, దీప్తిశ్రీనగర్, మదీనాగూడ, గంగారం, చందానగర్, మియాపూర్, కేపీహెచ్బీ కాలనీ, కూకట్‌పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, బాచుపల్లి, బొల్లారం, హైదర్‌ నగర్‌ రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో 24 గంటల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించి నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు. 

మరోవైపు.. హైదరాబాద్ మాదాపూర్ వడ్డెర బస్తీలో కలకలం రేపిన కలుషిత నీటి ఘటనకు సంబంధించి బాధితుల సంఖ్య పెరుగుతోంది. బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు బాధితుల సంఖ్య 76కి చేరింది. వీరిలో 34 మంది చిన్నారులు ఉన్నారు. కలుషిత నీటివల్లే అస్వస్థతకు కారణమని స్థానికులు చెబుతున్నారు. బాధితులకు కొండపూర్ ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులు వాంతులు, విరేచనాలు, జ్వరంతో బాధపుడుతున్నారు. 

మరోవైపు వడ్డెర బస్తీలో ఇంటింటికి వెళ్లి రోగలక్షణ సర్వే చేయడం తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక బృందాలను నియమించింది. ‘‘మేము మూడు మూలాల నుంచి నీటి నమూనాలను సేకరించాం. రిజర్వాయర్ నుంచి, నీటి లైన్ల నుంచి, వినియోగదారుల ఇళ్ల నుంచి నీటి నమునాలను సేకరించి.. జీవ పరీక్షల కోసం Institute of Preventive Medicineకి పంపాం. వచ్చే 48 గంటల్లో ఫలితాలు వస్తాయి. అప్పుడే సరైన కారణం తెలుస్తుంది’’ అని జిల్లా జిల్లా సర్వేలెన్స్ అధికారి డాక్టర్ జనార్దన్ తెలిపారు. ఇక, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని సందర్శించిన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు.. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి జలమండలి అధికారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.