వరంగల్ టిఆర్ఎస్ కు భారీ షాక్

First Published 23, Nov 2017, 12:58 PM IST
warangal TRS suffers severe jolt many resign from the party
Highlights
  • గుబులు రేపుతున్న మూకుమ్మడి రాజీనామాలు
  • టిఆర్ఎస్ కు రాజీనామా చేసిన 9 మంది ఎంపిటిసిలు
  • పట్టించుకునే వారే లేరని ఆవేదన

వరంగల్ ఉమ్మడి జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి జిల్లా పరిధిలో మూకుమ్మడి రాజీనామాల అంశం పార్టీ పెద్దలకు గుబులు రేపుతున్నది. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. వరంగల్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ పరిణామాలకు సంబంధించిన పూర్తి వివరాలు చదవండి.
వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని భూపాలపల్లి జిల్లాలో అధికార టిఆర్ఎస్ పార్టీకి 9 మంది ఎంపిటీసిలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. టిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమ పదవులకు సైతం రాజీనామాలు ఇచ్చారు. జిల్లాలోని మంగంపేట మండలంలో ఈ మూకుమ్మడి రాజీనామాల ఘటన 22వ తేదీన జరిగింది. మండలంలోని ఎంపిడిఓ ఆఫీసులో తమ రాజీనామా లేఖలను చూపుతూ వారు మీడియాతో మాట్లాడారు.


ప్రజలు వేసిన ఓట్లతో గెలిచిన తాము ఏమాత్రం ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని, నాలుగేళ్లుగా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఏ ఒక్క పని కూడా చేయలేకపోతున్నామని, ఏదైనా పనుల గురించి ప్రజలు అడిగితే సమాధానం చెప్పలేక ముఖం చాటేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వెలిబుచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో తమను పట్టించుకునే నాథుడే కరువైండని బాధపడ్డారు.
తమ రాజీనామా లేఖలను మండల అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జి, రాష్ట్ర అధ్యక్షుడు (కేసిఆర్) కు పంపిస్తామని వారు తెలిపారు. 
రాజీనామా చేసిన 9 మంది ఎంపిటిసిలలో
చౌలం వెంకటేశ్వర్లు (రాజుపేట ఎంపిటిసి),
ధార రాంబాబు (కత్తిగూడెం ఎంపిటిసి)
మారబోయిన గోవర్దన్ (మల్లూరు ఎంపిటిసి)
బొచ్చు సమత వెంకన్న (రమణక్కపేట ఎంపిటిసి)
చిలుకమర్రి అరుణకుమారి శ్రీనివాస్ (చెరుపల్లి ఎంపిటిసి)
చిన్నపల్లి శ్రీలత రాంబాబు (తిమ్మంపేట ఎంపిటిసి
గాదరి ధనలక్ష్మి (మంగపేట ఎంపిటిసి)
ఎట్టి నర్సింహ్మ  (నర్సింహ్మా సాగర్) 
వీరితోపాటు మరో ఎంపిటిసి కూడా రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. 
ఈ రాజీనామాల వ్వవహారం పార్టీలో గుబులు రేపుతున్నది. స్వయానా అసెంబ్లీ స్పీకర్ అయిన మధుసూదనాచారి జిల్లాలో ఈ ఘటన జరగడంతో రాష్ట్రమంతా పాకిపోతున్నది.

loader