తనపై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వరంగల్ సీపీ రంగనాథ్ సవాల్ విసిరారు.  తాను ఎవరి పక్షాన వుంటానో ప్రజలకు తెలుసునని ఆయన పేర్కొన్నారు.

తనపై ఆరోపణలు చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు వరంగల్ సీపీ రంగనాథ్ సవాల్ విసిరారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని సీపీ ఛాలెంజ్ విసిరారు. తనపై బండి సంజయ్ అనేక ఆరోపణలు చేశారని.. కానీ తాను ఎవరి పక్షాన వుంటానో ప్రజలకు తెలుసునని రంగనాథ్ అన్నారు. బండి సంజయ్ పోలీసులపై ఆరోపణలు చేస్తుంటారని.. కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కొందరికి బాధ కలగొచ్చని రంగనాథ్ పేర్కొన్నారు. 

రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నానని.. తనపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తానని సీపీ స్పష్టం చేశారు. సత్యంబాబు కేసును తాను హ్యాండిల్ చేయలేదని రంగనాథ్ అన్నారు. ఆ కేసులో తాను విచారణాధికారిని కాదని.. స్పెషల్ ఆఫీసర్‌గా తనను నందిగామకు పంపించారని రంగనాథ్ వెల్లడించారు. ప్రతి కేసులో ప్రమాణాలు చేస్తే.. తాను ఇప్పటి వరకు పదివేల సార్లు ప్రమాణాలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రమాణం అనే మాట వినడానికే ఆశ్చర్యం వేస్తోందన్నారు. 

ఇదిలావుండగా నిన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ సీపీ రంగనాథ్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ముందు సీపీ కాల్ డేటా తీయాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ, ఖమ్మంలలో రంగనాథ్ ఏం చేశారో తెలుసునని.. త్వరలో ఆయన ఆస్తుల చిట్టా బయటకు తీస్తానని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంవో నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. తన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు చెప్పడంపై సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: నా ఫోన్ కేసీఆర్ వద్దే, రంగనాథ్ చిట్టా బయటపెడతా: బండి సంజయ్

కాగా.. ఈ నెల 4వ తేదీన టెన్త్ క్లాస్ హీందీ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. ప్రశాంత్ అనే వ్యక్తి పలువురికి వాట్సాప్ ద్వారా టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ను పంపినట్టుగా పోలీసులు ప్రకటించారు. బండి సంజయ్ , ఈటల రాజేందర్ సహా పలువురికి ప్రశాంత్ నుండి వాట్సాప్ లో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం చేరిందని వరంగల్ సీపీ రంగనాథ్ ప్రకటించారు. 

ఇక, పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంలో బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. గత మంగళవారం రాత్రి బండి సంజయ్‌ను కరీంనగర్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. అక్కడి నుంచి బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. బండి సంజయ్‌ను బుధవారం బొమ్మలరామారం నుంచి వరంగల్‌కు తరలించారు. ఆయనను బుధవారం సాయంత్రం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో సంజయ్‌ను నిన్న రాత్రి కరీంనగర్ జైలుకు తరలించారు. ఇక, ఈ కేసులో బండి సంజయ్‌ను ఏ-1గా పేర్కొన్న పోలీసులు.. ఆయనపై ప్రధాన కుట్రదారు అని అభియోగం మోపారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.