వరంగల్ : దేవాలయాలకు ప్రతిరూపంగా భావించే కళాశాలల్లో మత్తు పొగలు కమ్ముకుంటున్నాయి. చదువులతల్లి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లలు మత్తుమైకంలో పడి తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. జల్సాల కోసం మత్తుకు బానిసలై నూరేళ్ల జీవితాన్ని మత్తుకు దాసోహం చేస్తున్నారు.

ఒకప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో డ్రగ్స్ మాయలో పడి విద్యార్థులు తమ జీవితాలను ఆగం చేసుకునేవారు. అయితే ఆ కల్చర్ కాస్తా ఇప్పుడు వరంగల్ నిట్ కు సైతం చేరింది. వరంగల్ నిట్ లో గంజాయి సేవిస్తూ 11 మంది విద్యార్థులు పట్టుబడటం సంచలనంగా మారింది. పట్టుబడ్డ 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది నిట్ యాజమాన్యం. 

వివరాల్లోకి వెళ్తే అక్టోబర్ 27న నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడ్డారన్న విషయం బయటకు రావడంతో నిట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

దాంతో రంగంలోకి దిగిన డీన్‌ నేతృత్వంలో నిట్‌ అధికారులు కమిటీ వేశారు. విచారణ చేపట్టిన క్రమశిక్షణ కమిటీ విద్యార్థులు గంజాయి తాగినట్టు నిర్ధారించింది. గంజాయి సేవించిన 11 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసింది.  

ఇకపోతే యూనివర్శిటీలో ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారన్న వార్తలపై వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎస్‌. గోవర్థన్‌ రావు స్పందించారు. విద్యార్థులు గంజాయి సేవిస్తూ సెక్యూరిటీకి పట్టుబడ్డారని స్పష్టం చేశారు. ఈ సంఘటన అక్టోబర్‌ 27వ తేదీ రాత్రిపూట జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. 

అక్టోబర్ 27న సెక్యూరిటీ సిబ్బంది రొటీన్‌ చెకప్‌లో భాగంగా తనిఖీ చేస్తున్నప్పుడు 1.8కె హాస్టల్‌ గదిలో మొదటి సంవత్సరం చదువుతున్న 11 మంది విద్యార్ధులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. గంజాయి సేవించిన అంశంపై క్రమశిక్షణ వేశామని తెలిపిన సంగతి తెలిసిందే. 

హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రముఖ కళాశాలల్లో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ వినియోగిస్తూ చాలాసార్లు దొరికిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కొందరు విద్యార్థులు అయితే ఏకంగా మాదకద్రవ్యాల వినియోగం, క్రయవిక్రయాల్లో కూడా కీలకపాత్ర పోషిస్తూ పోలీసులకు పట్టుబడిన వారు కూడా ఉన్నారు. 

ఇలా పట్టుబడిన వారిలో ఉన్నత చదువుల కోసం నగరానికి వచ్చి అక్రమార్కుల ఉచ్చులో చిక్కుకున్నవారే. జల్సాల కోసం ఈ చీకటి కార్యకలాపాల్లో పాల్గొంటూ బంగారంలాంటి తమ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. 

తల్లిదండ్రులకు దూరంగా ఒంటరిగా వసతిగృహాలు, అద్దె గదుల్లో ఉండే విద్యార్థులే ఎక్కువగా ఈ ఉచ్చులో పడుతున్నారని పోలీసుల విచారణ తేలింది. అబ్కారీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటై విస్తృతంగా తనిఖీలు చేపట్టగా వారి తనిఖీల్లో పట్టుబడిన వారంతా విద్యార్ధులే కావడం అందులోనూ వారంతా ఆర్థికంగా స్థిరపడినవారే కావడం విశేషం. 

ఆర్థిక ఇబ్బందులతో ఈ ఉచ్చులోకి వచ్చిన విద్యార్థుల కంటే జల్సాల కోసం ఈ ఉచ్చులో చిక్కుకున్న వారే ఎక్కువని చాలాసార్లు పోలీసులు స్పష్టం చేశారు. అలా ఒక్కసారి గంజాయి, డ్రగ్స్ కు అలవాటైన విద్యార్థులు ఆ మత్తు నుంచి కోలుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి.