వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ తన పదవికి రాజీనామా చేసారు. అనారోగ్య కారణంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు బత్తుల శ్రీనివాసరావు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 

కరోనా కోరలు చాస్తున్న వేళ కరోనా డెడికేటెడ్ ఆసుపత్రి ఎంజిఎం సూపరింటెండెంట్ రాజీనామా చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఇంత  చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. 

కరోనా రోగులకు సౌకర్యాలు  కల్పించమని రోగుల నుంచి విన్నపాలు వస్తుండగా, అధికారులేమో ఉన్న నిధులతోనే సర్దుకుపోవాలని సూచిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటిలేటర్లు వచ్చినప్పటికీ... వాటిని మేనేజ్ చేయడానికి టెక్నిషియన్లు అందుబాటులో లేకపోవడంతో అవి పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావడంలేదని ఆయన అనేకసార్లు పై అధికారులతో ప్రస్తావించినట్టుగా తెలియవస్తుంది. 

ఆయన భార్య కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆయన సైతం ప్రస్తుతానికి క్వారంటైన్ లోనే ఉంటున్నారు. ఈ అన్ని ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్టుగా తెలియవస్తుంది. ఆయన అనారోగ్య కారణం అని లేఖలో పేర్కొన్నప్పటికీ... అసలు కారణం మాత్రం ఒత్తిళ్లే అని అంటున్నారు. 

ఇటీవల నిజామాబాదు ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇప్పుడు ఎంజిఎం ఆసుపత్రి సూపరింటెండెంట్. కరోనా వేళ వరుస రాజీనామాలు తెలంగాణలో కలకలం సృష్టిస్తున్నాయి.