డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యే.. ఆ ఇంజెక్షన్ తీసుకుని : వరంగల్ సీపీ సంచలన ప్రకటన
డాక్టర్ ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం వల్లే మరణించినట్లు వరంగల్ పోలీస్ కమీషనర్ రంగనాథ్ ప్రకటించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రీతి మృతిపై వరంగల్ సీపీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. డాక్టర్ ప్రీతిది ఆత్మహత్యేనని ఆయన వెల్లడించారు. పాయిజిన్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్లే ప్రీతి మరణించినట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్ కూడా ఈ విషయం తెలిపిందన్నారు. అయితే ప్రతి ఆత్మహత్యకు ప్రధాన కారణం సైఫేనని రంగనాథ్ ప్రకటించారు. సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని ఆయన తెలిపారు. పదిరోజుల్లో ప్రీతి కేసుకు సంబంధించి ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని రంగనాథ్ పేర్కొన్నారు.
Also Read: మెడికో ప్రీతి మృతి కేసు.. సైఫ్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
కాగా.. కేఎంసీలో అనస్థీషియ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో స్పృహ లేని స్థితిలో పడి ఉన్న ప్రీతికి ఎంజీఎం ఆసుపత్రిలోనే మొదట అత్యవసర చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండడంతో.. అదే రోజు హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటినుంచి నిమ్స్ ఆసుపత్రిలోనే చికిత్స జరిగింది. కానీ ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం విశ్వప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు ప్రీతి ఆత్మహత్యా కాదని.. హత్య చేశారని ఆమె కుటుంబ సభ్యులు, విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు.