వరంగల్‌లో మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. వరంగల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

వరంగల్‌లో మెడికో ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌కు బెయిల్ మంజూరైంది. వరంగల్ ఎస్సీ, ఎస్టీ కోర్టు సైఫ్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.10 వేల బాండ్, ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని కోర్టు షరతు విధించింది. చార్జ్‌షీట్ దాఖలు చేసే తేదీలోగా లేదా 16 వారాల పాటు ప్రతి శుక్రవారం కేసు విచారణ ఆఫీసర్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కేసులో సాక్షులను ప్రభావితం చేయకూడదని సూచించింది. 

మృతురాలి కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేయొద్దని తెలిపింది. న్యాయస్థానం విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే సైఫ్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ప్రస్తుతం ఖమ్మం జైలులో ఉన్న సైఫ్‌కు బెయిల్ లభించడంతో ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఇక, మెడికో ప్రీతి మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే సైఫ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురిది మూమ్మాటికీ హత్యే అని ఆరోపిస్తున్నారు.