కారణమిదే: రేవంత్, స్పీకర్ మధ్య వాగ్వాదం

War words between speaker and revanth reddy
Highlights

స్పీకర్ ను నిలదీసిన రేవంత్

హైదరాబాద్:  తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మధ్య సోమవారం నాడు వాగ్వాదం చోటు చేసుకొందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు సభ్యత్వాలను పునరుద్దరించాలనే విషయమై వినతిపత్రం సమర్పించే సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఈ ఏడాది మార్చిలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభాన్ని పురస్కరించుకొని శాసనమండలి ఛైర్మెన్  స్వామిగౌడ్ పై హెడ్ ఫోన్ ను విసిరిన ఘటనలో  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. అయితే  ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దును తప్పుబడుతూ హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ లు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరుతూ సిఎల్పీ నేత జానారెడ్డి నేతృత్వంలో సోమవారం నాడు స్పీకర్ మధుసూధనాచారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా  స్పీకర్ మధుసూధనాచారికి మధ్య కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకొందని సమాచారం. హైకోర్టు తీర్పును అమలు చేయాలని స్పీకర్ ను రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై వీరిద్దరి మధ్య స్వల్పంగా వాగ్వాదం చోటు చేసుకొందని సమాచారం.  అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ లు కూడ తమ సభ్యత్వాలను పునరుద్దరించాలనే విషయమై స్పీకర్ తో  కొంత గట్టిగానే అడిగారని తెలుస్తోంది.

రేవంత్ వైఖరితో స్పీకర్ మధుసూధనాచారి కొంత అసంతృప్తికి గురై తాను వెళ్ళిపోతానని చెప్పడంతో సిఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకొని సర్ధిచెప్పారు. దీంతో  ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది.

loader