Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. హీటెక్కిన తెలంగాణ పాలిటిక్స్

Hyderabad: 25 కోట్ల రూపాయ‌లు తీసుకున్నారంటూ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన‌ ఆరోపణలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. అయితే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు స‌వాల్ ను నిరాక‌రించిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆల‌యానికి రాకుండా, దేవుని మీద ఒట్టు వేయ‌డాన్ని ప్ర‌శ్నించారు.
 

War of words between Congress-BJP; Telangana politics RMA
Author
First Published Apr 23, 2023, 8:23 PM IST | Last Updated Apr 23, 2023, 8:23 PM IST

Telangana Politics Congress-BJP: తెలంగాణ కాంగ్రెస్-బీజేపీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే విధంగా రాష్ట్ర రాజ‌కీయాలు మారాయి. ఇరు పార్టీల నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల క్ర‌మంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించడంతో తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల మ‌ధ్య మాటల యుద్ధం మొద‌లైంది. ఈటల ఆరోపణలను ఖండిస్తూ భాగ్యలక్ష్మి ఆలయంలో మొక్కుకున్న రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురైన మరుసటి రోజే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. పదవి పోతుందనే భయంతోనే రేవంత్ రెడ్డికి కన్నీళ్లు పెట్టుకున్నారంటూ వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల చెప్పలేదని సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ ఉపఎన్నికలో ఓడిపోవడానికి కాంగ్రెస్ కు రూ.25 కోట్లు ఇచ్చారని మాత్రమే ఆయన అన్నార‌ని తెలిపారు. 25 కోట్ల రూపాయ‌లు తీసుకున్నారంటూ ఈట‌ల రాజేంద‌ర్ చేసిన‌ ఆరోపణలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశారు. అయితే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు స‌వాల్ ను నిరాక‌రించిన బీజేపీ ఎమ్మెల్యే.. ఆల‌యానికి రాకుండా, దేవుని మీద ఒట్టు వేయ‌డాన్ని ప్ర‌శ్నించారు. గత ఏడాది చివర్లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెస్ ను వీడి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.

భాగ్యలక్ష్మి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించడాన్ని బండి సంజయ్ స్వాగతిస్తూ బీజేపీ  రాజకీయానికి అనుకూలంగా మార్చే విధంగా వ్యాఖ్యలు చేయడం మరింత అగ్గిని రాజేసింది. అందరూ ఆలయానికి రావాలన్న తన కోరిక నెరవేరుతోందని ఆయన పేర్కొన్నారు. అలాగే,  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కు బీఆర్ఎస్ డబ్బులు ఇస్తోందని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేస్తే టీఆర్ ఎస్ కు వేసినట్లేనన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని కోల్పోయిన ఈ పార్టీల ఓట్లను వృథా చేయవద్దని, ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

ఈ వాదనలకు కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ తో కుమ్మక్కయ్యింది బీజేపీయేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తేడా లేదని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఒక్కటే పోరాడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పై ఆరోపణలు బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. బీజేపీలో చేరే ఏ నాయకుడిని ప్రభావితం చేయడంలో ఈటల రాజేందర్ విఫలమయ్యారని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. ఈటల రాజేందర్ వద్ద ఆధారాలు ఉంటే టీపీసీసీ చీఫ్ సవాల్ ను స్వీకరించి భాగ్యలక్ష్మిపై ప్రమాణం చేయాలని దయాకర్ సవాల్ విసిరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios