Asianet News TeluguAsianet News Telugu

రాజ్ భవన్ కూడా రిజిస్టర్ చేయించుకుంటారా? హైకోర్టు సీరియస్

పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 1955లో మున్నీరున్నీసా బేగం దానం కింద ఇచ్చిన ఈ భూములపై 2006లో ఫఫైనల్ డిక్రీ వచ్చిందని... హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టులో 2013 నవంబర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చాయన్నారు. 

Wakf board claims Hafeezpet land its property
Author
Hyderabad, First Published Feb 24, 2021, 8:31 AM IST

వక్ఫ్ నామా కింద 1955 లో భూమి ఇస్తే 2013 వరకు ఏం చేస్తున్నారని వక్ఫ్ బోర్డును తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఆ భూములపై యాజమాన్య హక్కులను పరిశీలించకుండా రిజిస్టర్ చేసుకోవడాన్ని తప్పుబట్టింది. వక్ఫ్ నామా కింద రాజ్ భవన్ ను ఇచ్చినా రిజిస్టర్ చేయించుకుంటారా అంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్ పేటలోని  సర్వే నం.80 భూములకు సంబంధించి 2014 నవంబర్ 1న ఇచ్చిన గెజిట్  నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ... ఆ భూములు తమవంటూ సాయి పవన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కె. ప్రవీణ్ కుమార్ దాఖకలు చేసిన వేర్వేరు పిటిషన్ లపై మంగళవారం జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి. వినోద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ 1955లో మున్నీరున్నీసా బేగం దానం కింద ఇచ్చిన ఈ భూములపై 2006లో ఫఫైనల్ డిక్రీ వచ్చిందని... హక్కులకు సంబంధించి సుప్రీం కోర్టులో 2013 నవంబర్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఆ వెంటనే వక్ఫ్ బోర్డు సమావేశమై రిజిస్టర్ చేయించిందని తెలిపారు.

2014 నవంబర్ 1న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఈ నోటిఫికేషన్ ఆధారంగా పిటిషనర్లకు చెందిన భూములపై హక్కులు కోరుతూ స్వాధీనానికి ప్రయత్నిస్తోందన్నారు.

ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ హఫీజ్ పేట భూములన్నీ ప్రభుత్వానివేనన్నారు. ప్రభుత్వానికి చెందిన భూములను కొంత మంది ప్రైవేటు వ్యక్తులు భాగపరిష్కారం పేరుతో పంపిణీ చేసుకుంటే చెల్లుబాటు కాదన్నారు. ఇది ప్రభుత్వ భూమిగా పహాణీలో ఉందని తెలిపారు.

ముతవల్లీ తరపు న్యాయవాది ఖురేషీ వాదనలు వినిపిస్తూ వక్ఫ్ నామా ద్వారా ఆస్తులు వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఎలాంటి నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు.  ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. భూమిని ఇచ్చినప్పుడు మున్నీరుసా బేగం ఆ భూమి ఎలా వచ్చిందో చెప్పలేదంది. అంతేగాకుండా ఈ భూములు హైకోర్టులో పెండింగ్ ఉన్న నిజాం ఆస్తులకు సంబంధించిన సీఎస్ 14 కేసులో భాగమని, అప్పుడు కూడా ఇందులో ప్రతివాదిగా ఉన్న ఆమె తాను 140 ఎకరాలను వక్ఫ్ బోర్డుకు ఇచ్చినట్లు చెప్పలేదని పేర్కొంది.

ఆమె చనిపోయాక పత్రాలు సృష్టించినట్లు ఉందని.. కుమ్మక్కైనట్లుందని వ్యాఖ్యానించింది. భూమిని దానంగా ఇచ్చినప్పుడు పబ్లిక్ నోటీసు ఇచ్చి అభ్యంతరాలు ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపించడానికి మరింత గడువు కావాలని న్యాయవాది కోరగా నిరాకరిస్తూ బుధవారానికి వాయిదా వేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios