తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం మొదలైంది.  కొన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో.. ఓటర్లు అసహనానికి గురై.. ఓటు వేయకుండానే వెనుదిరుగుతున్నారు. 

హయత్ నగర్ ఇక్బాలియా ఇంటర్నేషనల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఇప్పటి వరకు పోలింగ్ ప్రారంభం కాలేదు. ఈవీఎంలు సిద్ధం కాలేదని, ఇంకా సమయం పడుతుందని ఓటర్లు అధికారులకు సూచించారు. వీవీ ప్యాట్ లో సాంకేతిక లోపంతో పోలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఓటర్లు తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.