ముంబై: విరసం నేత వరవరరావుకు కరోనా సోకిందని వైద్యులు ప్రకటించారు. తలోజా జైలులో రిమాండ్ లో ఉన్న వరవరరావును జేజే ఆసుపత్రిలో చేర్పించారు జైలు అధికారులు.

కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును  2018 ఆగష్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. వరవరరావు ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. 81 ఏళ్ల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ముంబైలోని జేజే ఆసుపత్రికి మూడు రోజుల క్రితం తరలించారు.

ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుండి వరవరరావు ఆరోగ్య పరిస్థితిలో తేడా వచ్చిందని కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ ఏడాది మే 28వ తేదీన అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను ఆసుపత్రిలో చికిత్స చేయించి తిరిగి జైలుకు తరలించినట్టుగా కుటుంబసభ్యులు గుర్తు చేసుకొన్నారు.

వరవరరావుకు మెరుగైన చికిత్స అందించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. రెండేళ్లుగా ఆయన తలోజా జైలులోనే ఉన్నారు. మరో వైపు కోరేగావ్ కేసులో విరసం నేత క్రాంతికి కూడ ఎన్ఐఏ గురువారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తమ ఎదుట విచారణకు రావాలని కోరింది.