దేశంలో రెండో దశ కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. అయితే కరోనా విస్తరించకుండా పట్టణ ప్రాంత వాసుల కంటే గ్రామస్తులే చురుగ్గా వుంటున్నారు

దేశంలో రెండో దశ కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. అయితే కరోనా విస్తరించకుండా పట్టణ ప్రాంత వాసుల కంటే గ్రామస్తులే చురుగ్గా వుంటున్నారు.

సహజంగానే ఏదైనా కష్టం వస్తే గ్రామ ప్రజలంతా ఒకే మాట మీద వుండటం తరతరాలుగా వస్తున్నదే. తొలి దశ సమయంలో కూడా గ్రామీణులు వైరస్ తమ గ్రామంలోకి అడుగుపెట్టకుండా కట్టుదిట్టంగా వ్యవహరించారు.

పోలీమేరల్లో ముళ్లకంచెలు వేయడంతో పాటు రహదారులను మూసివేసి కాపలా సైతం వుండేవారు. తాజాగా సెకండ్ వేవ్‌లోనూ అదే నిబద్ధతతో పనిచేస్తున్నారు పల్లెవాసులు. కొన్ని గ్రామాల్లో వారికి వారే లాక్‌డౌన్ విధించుకుంటున్నారు.

Also Read:గాలి ద్వారా వ్యాపించే స్టేజ్‌కు కరోనా... సెకండ్ వేవ్ మోస్ట్ డేంజర్: డా. శ్రీనివాస్ హెచ్చరికలు

మరికొన్ని గ్రామాల్లో జనం గుమికూడకుండా చర్యలు చేపడుతున్నారు. చాటింపులు వేయిస్తూ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం ఆరెపల్లిలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు గ్రామస్తులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

గ్రామంలో ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్‌‌గా తేలగా, ఒకరు మరణించారు. దీంతో గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టిన స్థానికులు కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.

దీనిలో భాగంగా గ్రామ కూడలిలో బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సిమెంట్‌ బెంచీల్లో జనం కూర్చోకుండా వాటిని తలకిందులు చేశారు. గ్రామస్థులు లేదా ఇతరులు ఒకచోట చేరకుండా అలా చేశామని ఊరి పెద్దలు చెబుతున్నారు.