తెలంగాణ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్‌కు జనం నుంచి నిరసన సెగ ఎదురవుతూనే ఉన్నాయి. తమ సమస్యలు పరిష్కరించలేదంటూ నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు ఇటువంటి అనుభవమే ఎదురైంది.

ప్రచారంలో భాగంగా వెంకటేశ్వర్లు భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలానికి చేరుకున్నారు. శ్రీరాంపురం, రేపల్లెవాడ, అన్నారం తండా, గానుగపాడు మీదుగా పోకలగూడేనికి చేరుకున్నారు. గ్రామానికి ఆయన చేరుకోగానే స్థానికులు పెద్ద ఎత్తున వెంకటేశ్వర్లును చుట్టుముట్టారు. లంబాడాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ నిలదీశారు.

తమ గ్రామానికి ఈ నాలుగేళ్లలో ఏం చేశారని.. ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ చెప్పులు, రాళ్లు విసిరారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకోవడంతో వెంకటేశ్వర్లుకు ప్రమాదం తప్పింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయన ప్రచారంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.