అధికార పార్టీకి చెందిన ఓ గ్రామ సర్పంచ్ ఇంటిపక్కనుండే యువతిని బెదిరించి పలుమాార్లు అత్యాచారానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చింది.దీంతో ఆమె శీలానికి వెలకట్టి తప్పించుకునే ప్రయత్నం చేసాడు సదరు సర్పంచ్. 

వరంగల్: బాద్యతాయుతమమైన సర్పంచ్ పదవిలో వున్నవ్యక్తి అత్యంత నీచంగా వ్యవహరించాడు. కూతురు వయసుండే యువతిని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసాడు. విషయం బయటపడకుండా చివరకు యువతి శీలానికి వెలకట్టాడు. ఈ అమానుషం వరంగల్ జిల్లాలో వెలుగుచూసింది.

బాధితురాలి తండ్రి కథనం ప్రకారం... వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ కుటుంబం కూలీపనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. నిరక్షరాస్యురాలైన 19ఏళ్ల యువతి కూడా తల్లిదండ్రులతో కలిసి దినసరి కూలీగా పనిచేస్తోంది. అయితే ప్రస్తుత గ్రామ సర్పంచ్ ఇంటిపక్కనే ఈ యువతి ఇళ్లు వుంది. ఈ క్రమంలోనే సదరు యువతిపై సర్పంచ్ కన్ను పడింది. ఎలాగయినా యువతిని లోబర్చుకోవాలని నీచంగా ఆలోచించిన సర్పంచ్ అదునుకోసం ఎదురుచూసాడు. 

ఈ క్రమంలోనే యువతి అదే గ్రామానికి చెందిన యువకుడితో ప్రేమలో వున్న విషయం సర్పంచ్ కు తెలిసిందే. ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులతో చెబుతానని సర్పంచ్ బెదిరించడంతో సదరు బాలిక భయపడిపోయింది. దీంతో మరింత రెచ్చిపోయిన సర్పంచ్ ప్రేమ విషయం బయటపెట్టకుండా వుండాలంటే తన కోరిక తీర్చాలని కోరాడు. ఇలా బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఇటీవల సర్పంచ్ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. సదరు బాలిక తనకే సొంతమంటూ ఆమె ప్రియుడితో తాగిన మత్తులో గొడవకు దిగాడు. ఆమెను వదిలేయాలని... లేదంటే అంతుచూస్తానని హెచ్చరించాడు. అనంతరం నేరుగా యువతి ఇంటికి వెళ్ళి ఆమెను కూడా బెదిరించాడు. ఇక అతడి బెదిరింపులకు భరించేందుకు ఇష్టపడని యువతి విషయాన్ని తల్లిదండ్రులను తెలిపింది. తనను సర్పంచ్ ఎలా బెదిరించింది... లైంగికదాడిచేసిన విషయాలను బాధితురాలి బయటపెట్టింది. ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు గ్రామపెద్దల దృష్టికి తీసుకువెళ్లిన నిందితుడు అధికార పార్టీ సర్పంచ్ కావడంతో వారుకూడా ఏం చేయలేకపోయారు. 

అయితే తాజాగా యువతి అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు హాస్పిటల్ కు తరలించగా టెస్టులు చేసిన డాక్టర్లు నాలుగునెలల గర్భవతిగా తేల్చారు. విషయం తెలియడంతో సర్పంచ్ గ్రామ పెద్దల ద్వారా రాజీకి సిద్దమయ్యారు. యువతి కుటుంబానికి రూ.50వేలు ఇవ్వాలని గ్రామపెద్దలు సూచించారు. కానీ యువతి కుటుంబం మాత్రం న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదట.