అమరావతి: కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవాలయంలో పనిచేసే అర్చకుడికి కరోనా సోకింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆలయంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు కూడ కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనా సోకిన అర్చకుడితో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారికి కూడ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆలయంలో లక్ష కుంకుమార్చన సేవలో విధులు నిర్వహిస్తున్న అర్చకుడికి కరోనా సోకింది. 

విజయవాడ నగరంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నెల 8వ తేదీ నుండి ఆలయాలను తెరిచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే రెండు రోజుల పాటు ట్రయల్ నిర్వహించి ఈ నెల 10వ తేదీ నుండి బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలోకి భక్తులను అనుమతి ఇచ్చారు. ప్రతి రోజూ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 10,331కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 497 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలోనే 10 మంది మరణించారు. రాష్ట్రంలో కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.