ఏ ఆడబిడ్డకు కష్టం రావద్దు.. నిర్దోషులుగానే నిలవాలి.. కవితకు ఈడీ నోటీసులపై విజయశాంతి సానుభూతి..
ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు బీజేపీ నేత విజయశాంతి సానుభూతి చూపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
హైదరాబాద్ : మాజీ ఎంపీ విజయశాంతి మరోసారి టిఆర్ఎస్ పార్టీపై… ఎమ్మెల్సీ కవితపై వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పై బిజెపి నేత, మాజీ ఎంపీ విజయశాంతి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీద విజయశాంతి సానుభూతి ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు ఈడి మరోసారి నోటీసులు అందించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే విజయశాంతి సానుభూతి తెలుపుతూ పోస్ట్ చేశారు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఆడబిడ్డ అయినా సరే నిర్దోషులుగానే ఎప్పుడు నిలవాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను అంటూ విజయశాంతి పేర్కొన్నారు. ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు అన్నారు. ఈడీ నోటీసులు ఇప్పుడు పంపడం, కక్ష సాధింపు చర్యలో భాగమేనని కవిత అన్న మాటలను విజయశాంతి తప్పుపట్టారు.
ఈడీ నోటీసులను సుప్రీం కోర్టులో సవాల్ చేసిన కవిత
ఎమ్మెల్సీ కవిత అరెస్టు బిజెపికి రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఆమె అరెస్ట్ కావాలని కోరుకోవడం బీజేపీకి అవసరమేం లేదన్నారు. ఆ ఆవశ్యకత కూడా బిజెపికి లేదు అంటూ విజయశాంతి వివరణ ఇచ్చారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అనేక సమస్యలపై చర్యలు తీసుకోవడానికి నిర్దేశించబడిన ప్రభుత్వ సంస్థలు ఈడి, సిబిఐ లు అన్నారు.
అవి తమ పని తాము నిర్వహిస్తాయి. కవిత గారు అరెస్టు కానట్లయితే బిజెపి బీఆర్ఎస్ ఒకటే అనే భావంతో బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటు చేయొచ్చు అన్న భయం టిఆర్ఎస్ కు, ఎంఐఎం ప్రేరేపితుల్లో ఉండొచ్చు. కానీ, జాతీయవాదా బిజెపికి ఆ ఆలోచన ధోరణి ఉండదు అని విజయశాంతి చెప్పుకొచ్చారు. కొంతమంది బీఆర్ఎస్ ప్రోత్బలంతోనే గతంలో ఒకసారి అప్రూవల్ గా ఉండి.. మళ్లీ కిలాఫ్ గా మారి, తిరిగి మళ్లీ అప్రూవల్ గా మారుతున్నారని అభిప్రాయం వినవస్తుందంటూ ఈ పోస్టులో విజయశాంతి పేర్కొన్నారు.
కాగా, ఈ కేసులో నిందితుడుగా ఉన్న హైదరాబాదీ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిల్లై మొదట అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అప్రూవర్ గా మారడం, న్యాయమూర్తి ముందు అరుణ్ రామచంద్ర పిల్లే వాంగ్మూలం ఇవ్వడం.. ఆ తర్వాత వెంటనే కవితకు ఈడి మరోసారి నోటీసులు పంపించడం వెంట వెంటనే జరిగిపోయాయి.
దీనిమీద కవిత స్పందిస్తూ ఇవి అంత ఏదో టీవీ సీరియల్ లాగా ఉందని… ఈడీ నోటీసులు కాదు, మోడీ నోటీసులు అంటూ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు స్థితులు, రానున్న ఎన్నికల నేపథ్యంలోనే రాజకీయ లబ్ధి కోసమే నోటీసులు పంపారని కవిత చెప్పుకొచ్చారు. అంతేకాదు, తాను ఈడీ విచారణకు హాజరు కాబోనని కూడా తెలిపారు.