హైదరాబాద్: రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం మియాపూర్ భూ కుంభకోణం వెలుగుచూసినప్పుడు మొత్తం రెవిన్యూ శాఖను ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ ప్రకటనలు గుప్పించారని ఆమె గుర్తు చేశారు. 

అప్పట్లో మియాపూర్ భూవివాదం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిందని, దీంతో దానిపై టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆసక్తిగా చూశారని, తీరా కార్యాచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేసిందని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్‌కు చెందిన బడా నేతలకు మియాపూర్ భూ కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయని తేలడంతో రెవిన్యూ శాఖ ప్రక్షాళన అంశాన్ని కేసీఆర్ అటకెక్కించారని ఆమె అన్నారు. 

అప్పట్లో కేశవరావు వంటి బడుగు వర్గానికి చెందిన టీఆర్ఎస్ నేతలను బలి పశువులను చేసి, తమకు సన్నిహితంగా ఉన్నవారిని కాపాడి, అప్పటి భూ వివాదాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని అన్నారు. నిజానికి మియాపూర్ భూ వివాదానికి సంబంధించి తాను న్యాయపోరాటం చేస్తానని తొలుత ప్రకటించిన కేశవరావు చివరకు టీఆర్ఎస్పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి, తాను కొన్న భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి వచ్చిందని అన్నారు. 

సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత తిరుగుబాటు చేసే స్ధాయిలో రాద్ధాంతానికి కారణమైన మియాపూర్ భూ దందా బయటపడిన రోజే రెవిన్యూ శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ నడుం బిగించి ఉండాల్సిందని ఆమె అన్నారు. రెవిన్యూ శాఖ ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ చేసిన ప్రకటన వెనుక దాగి ఉన్న రాజకోట రహస్యం త్వరలో బయటపడుతుందని, అది ఆవిష్కృతమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని ఆమె అన్నారు.