అలకబూనిన విజయశాంతి.. క్లారిటీ తీసుకున్న బీజేపీ.. అక్కడి నుంచి పోటీ చేస్తారటా!
బీజేపీ నేత విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అన్నింటికీ అంటిముట్టనట్టు ఉన్నారు. దీంతో నాయకత్వం ఆమెను పిలిచి మాట్లాడింది. ఆమె మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నదని పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు చెప్పినట్టు తెలిసింది.
న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటన, ప్రచార వ్యూహాలు, నినాదాలు, ఆకర్షణీయ హామీల గురించి చర్చిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఒక్క చాన్స్ కోరుతుండగా మ్యాజిక్ చేయాలని బీజేపీ చూస్తున్నది. కానీ, తెలంగాణ బీజేపీ కొంత నెమ్మదించిన సంగతి తెలిసిందే. వ్యవస్థాగత మార్పులు కొన్నైతే.. పార్టీ క్యాడర్‌లోనూ తగ్గిన జోష్, కాంగ్రెస్ పుంజుకోవడం వంటి కారణాలు ఉన్నాయి. ఈ తరుణంలో పార్టీకి చెందిన కొందరి నేతల్లోనూ అసంతృప్తి ఉన్నట్టు బయటపడింది. నాయకత్వం వారిని బుజ్జగించే పనిలో పడింది.
తెలంగాణ బీజేపీలో విజయశాంతి కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఆమె వైఖరి మారింది. పరోక్షంగా పార్టీపైనే పంచ్‌లు వేస్తూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ నాయకత్వం ఆమెను దారిలోకి తెచ్చుకోవాలని భావించింది. ఇటీవలే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. విజయశాంతితో సమావేశం అయ్యారు. ఆమెను పిలిచి మాట్లాడటంత రాములమ్మ అలక వీడినట్టు సమాచారం.
ఆమె అసంతృప్తికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విజయశాంతి మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. ఇదే విషయాన్ని ఆమె జేపీ నడ్డా ముందు ఉంచినట్టు సమాచారం. అయితే, ఈ సీటు కోసం ఇది వరకే బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్ రావు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అనివార్యంగానే ఈ ఇద్దరు నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.
Also Read: నేను బ్యాచిలర్‌గానే ఉండిపోయాను. ఎందుకంటే..: పెళ్లి ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇదే
ఈ నేపథ్యంలోనే పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని కొందరు వీరిద్దరి వ్యవహారంపై కామెంట్లు కూడా చేశారు. ఈ డ్యామేజీ పెరగకుండా బీజేపీ నేతలు వెంటనే స్పందించి ఆమెను పిలిచి మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదని, వాటి కంటే ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయని జేపీ నడ్డా ఆమెకు గుర్తు చేశారు. కాబట్టి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కలిసి పని చేయాలని, పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. పార్లమెంటు ఎన్నికలు ఇంకా చాలా దూరం ఉన్నందున వాటిని ఇప్పుడే మనసులో పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు తెలిసింది.
మల్కాజీగిరి స్థానానికి ఇద్దరు నేతలు పోటీ పడుతుండటంతో పార్టీ అధిష్టానం ఏ నేతకు టికెట్ ఇస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.