కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబలించేస్తోంది. రోజు రోజుకీ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య , దాని వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. దేశంలోనూ ఈ వైరస్ కారణంగా ఇప్పటికే పది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోనూ 33 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఈ వైరస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా!..

ప్రజలను ఎవరినీ ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31 వరకు తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించారు. అయితే.. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిత్యవసరాలతోపాటు రూ.1500 కూడా ఇస్తామని చెప్పారు.

కాగా.. కేసీఆర్ చేసిన ఈ ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి జై కొట్టారు. దేశంలో పరిస్థితి గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తు చేశారు. 

తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్థించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి చెబుతున్నది జనాల సంక్షేమం కోసమేనని హితవు పలికారు. సోషల్ మీడియా వేదికగా ఆమె కరనా వైరస్ పై స్పందించారు. 

‘‘మనం ఇటలీ, అమెరికా, స్పెయిన్ లాంటి చాలా దేశాలకన్నా వైద్యపరంగా గొప్పోళ్ళం ఏమీ కాదు. అజాగ్రత్తతో వచ్చిన పరిణామాల వల్ల తక్కువ జనాభా ఉన్న ఆ దేశాలు కూడా అల్లాడిపోతున్నాయి. మన దేశంలో అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవు. పంజాబ్ ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలి. మన రాష్ట్రాలలో కూడా అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే సంఖ్య 33 దాటింది.’’

‘‘వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చింది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. వివేకంతో వ్యవహరించండి. అయితే రాజకీయ విమర్శలు చేయడానికి ఇది సందర్భం కాదు గనక... ఇప్పటికైనా ప్రభుత్వం సమస్య తీవ్రతను గుర్తించి, తీసుకుంటున్న చర్యలకు అభినందిస్తున్నాను. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడంతో పాటు.. ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉంది.’’ అని విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.

‘‘మన దేశంలో వైరస్ వల్ల పరిస్థితి అదుపు తప్పితే, ఆపగలిగే పరిస్థితులు లేవు. పంజాబ్ ఎందుకు కర్ఫ్యూ విధించిందో ఆలోచించాలి. మన రాష్ట్రాలలో కూడా అంతకన్నా తీవ్ర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే సంఖ్య 33 దాటింది. వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడం ప్రస్తుత పరిస్థితిని ఎంతో ఆందోళనకరంగా మార్చింది. ప్రజలారా ఆలోచన చెయ్యండి. వివేకంతో వ్యవహరించండి’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.