కోల్‌కతా నగర పోలీస్ కమిషనర్ ఇంటిపై సీబీఐ దాడిని నిరసిస్తూ.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ విధానాలకు నిరసనకు మమత చేపట్టిన దీక్షకు దేశంలోని బీజేపీయేతర పక్షాలన్నీ మద్ధతు ప్రకటించాయి.

కానీ టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం మాట మాత్రంగానైనా మమతకు మద్ధతుగా మాట్లాడలేదు. చంద్రశేఖర్ రావు వ్యవహారశైలిపై సినీనటి, కాంగ్రెస నేత విజయశాంతి ఫైరయ్యారు.

రాష్ట్రప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్పూర్తికి విరుద్ధమని గొంతు చించుకునే కేసీఆర్.. మరి అదే విషయంలో పోరాడుతున్న మమతా బెనర్జీకి సంఘీభావం ఎందుకు ప్రకటించలేదన్నారు.

గత రెండు రోజులుగా కేంద్రప్రభుత్వం బెంగాల్ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని గుర్తు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థను స్వప్రయోజనాలకు వాడుకుంటూ ప్రధాని మోడీ ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీస్తున్నారన్న మమతా ఆరోపణలను విజయశాంతి ప్రస్తావించారు.

ఇంత జరుగుతుంటే, ఫెడరల్ వ్యవస్థను కాపాడాలని ఉద్యమిస్తున్న కేసీఆర్... మమతకు మద్ధతుగా ఎందుకు ఒక్క ప్రకటన కూడా చేయడం లేదన్నారు. ‘‘ కేసీఆర్ భావిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పరిధిలోకి కోల్‌కతాలో సీబీఐ దాడుల అంశం రాదా..? లేక కొన్ని విషయాలను చూసి, చూడనట్లు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్ అజెండాలో భాగమా..? అని విజయశాంతి ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

కోల్‌కతా సీపీ నివాసంపై సీబీఐ దాడి..అర్థరాత్రి రోడ్డుపై మమత ధర్నా