హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఓవైసి దివంగత తెలుగు ప్రధాని పివి నరసింహరావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చాలంటూ చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయశాంతి ఘాటుగా స్పందించారు.   

''అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పివి ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లు కూల్చమని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజల ఎఫ్‌టిఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని... ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్ కూల్చాలని కూడా అనవచ్చు'' అంటూ అక్బర్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ విజయశాంతి ట్వీట్ చేశారు. 
 
''ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నాను'' అంటూ మరో ట్వీట్ ద్వారా సెటైర్లు విసిరారు విజయశాంతి. 

read more  ఎన్టీఆర్ కు భారతరత్న... కేంద్రాన్ని ఒప్పిస్తాం: బండి సంజయ్

ఇక అంతకుముందు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న వ్యాఖ్యలపైనా విజయశాంతి స్పందించారు. ''సర్జికల్ స్ట్రయిక్ అన్న అంశానికి సంబంధించి హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆరెస్, ఎంఐఎం ఇంత ఆగమాగం ఎందుకు అవుతున్నాయి?'' అని నిలదీశారు. 
 
''టీఆరెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇంటింటి సర్వే చేసిందని... పాతబస్తీలో ఆ విధంగా ఎవరూ లేరని... సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్రానికి అధికారపూర్వక నివేదిక ఇవ్వచ్చు కదా?'' అని పేర్కొన్నారు. 

''లేకుంటే ఎవరినైనా దాచిపెట్టడం వల్లనే భయాందోళనలకు టీఆరెస్ గురవుతున్నదని ప్రజలు అభిప్రాయపడే అవకాశముంది'' అంటూ వరుస ట్వీట్ల ద్వారా ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు విజయశాంతి.

హైదరాబాద్ లో నాలాలపై వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చేస్తామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసి ముందు హుస్సెన్ సాగర్ సమీపంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన పివి, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇప్పటికే ఘాటుగా స్పందించిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి ఇవాళ(గురువారం) పివి ఘాట్ ను సందర్శించారు. తాజాగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై విజయశాంతి కూడా స్పందించారు.