హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీ రామారావు అంటూ సాగుతున్న ప్రచారంపై తెలంగాణ కాంగ్రెసు నేత, సినీ నటి విజయశాంతి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె ఆ ప్రచారంపై తన అభిప్రాయాలను తెలియజేశారు. ఆ ప్రచారంపై ఆమె కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు.

త్వరలో కార్పోరేషన్లు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడనునాయని, ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెసు పార్టీలకు మధ్యనే పోటీ ఉంటుందని ఆమె చెప్పారు. మున్సిపల్ ఎన్నికల తీరుపై తమ పార్టీ జిల్లా నేతలతో మాట్లాడినప్పుడు గతంలో మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అధిక స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారని ఆమె అన్నారు. 

ఒక వేళ అదే కనుక జరిగితే ఆ క్రెడిట్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ ఖాతాలో వేయాలనేది ఆ పార్టీ అధిష్టానం భావనగా తెలుస్తోందని ఆమె అన్నారు. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా అటు ప్రతిపక్ష నేతలు కొందరు కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం జరుగబోతుందంటూ సాగుతున్న ప్రచారానికి మరింత ఊపునిస్తున్నారని ఆమె అన్నారు.

కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి అవుతారంటూ పెద్ద యెత్తున ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులు కూడా అందుకు అనుగుణంగానే మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విజయశాంతి తన అభిప్రాయాలను పంచుకున్నారు.