వరంగల్: కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి లైంగిక ఆరోపణల వివాదం రోజురోజుకు ఉద్రిక్తమవుతుంది. గండ్ర వెంకటరమణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ విజయలక్ష్మీరెడ్డి అనే మహిళ భూపాలపల్లి జయశంకర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగింది. విజయలక్ష్మీరెడ్డికి పలువురు మహిళలు సైతం మద్దతు పలికారు. విజయలక్ష్మీరెడ్డి ఆందోళనపై మహిళా కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ధర్నాను విరమించాలని మహిళా కాంగ్రెస్ నేతలు విజయలక్ష్మీరెడ్డిని హెచ్చరించారు. గండ్రను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసేవరకు తాను ఆందోళన విరమించేది లేదని భీష్మించుకుని కూర్చుంది. దీంతో ఆగ్రహం చెందిన మహిళా కాంగ్రెస్ నేతలు ఆమెపై దాడికి దిగారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణ నిమిత్తం స్టేషన్ కు తరలించారు. 

అయితే విజయలక్ష్మీరెడ్డి ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులను సైతం ఆశ్రయించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని  విజయలక్ష్మి రెడ్డిపై ఆగష్టు 6న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయలక్ష్మీరెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తప్పుడు ఆరోపణలతో తనను వేధింపులకు గురిచేస్తోందని వెంకటరమణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తన గెలుపు ఖాయమనే నిర్ధారించుకున్న తర్వాతే టీఆర్ఎస్ పార్టీ విజయలక్ష్మీరెడ్డి అనే మహిళను రంగంలోకి దింపిందన్నారు.