Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోయిన్ల కేసులు మాత్రం పట్టించుకోలేదు.. విజయశాంతి షాకింగ్ కామెంట్స్

గతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హీరోయిన్ల కేసులు మాత్రం ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె.. ఈ కేసుపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టారు.

Vijaya shanthi comments on Sushanth singh rajput death case
Author
Hyderabad, First Published Sep 4, 2020, 10:24 AM IST

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాగా.. ప్రస్తుతం సుశాంత్ కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా.. ఈ కేసుపై తొలిసారి సినీ నటి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు.

సుశాంత్ రాజ్ పుత్ మరణం వెనుక వాస్తవాలను వెలికితేసేందుకు ప్రభుత్వాలన్నీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించడం తనకు ఆనందంగానే ఉందని.. కాకపోతే.. గతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన హీరోయిన్ల కేసులు మాత్రం ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె.. ఈ కేసుపై సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు పెట్టారు.

‘దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే గానీ... మన సినీరంగంలో ఒకప్పుడు ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకుని ఎందరో నటీమణులు బలవన్మరణాలకు పాల్పడిన సంగతి మనందరికీ తెలుసు. వారిలో ఒక్కరి ఆత్మకైనా శాంతి కలిగించేలా ఈ స్థాయిలో విచారణలు... దర్యాప్తులు జరిగాయా? చాలామంది నటీమణులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు కావడం, తూతూ మంత్రంగా విచారణ చేసి చివరకి మమ అనిపించడమే చూశాం. సుశాంత్ కేసులో బయటకొస్తున్న విషయాలు చూస్తుంటే విస్మయం కలుగుతోంది. వెండితెరపై వెలగాలని ఎన్నో ఆశలతో వచ్చే కళాకారులు ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం బాధాకరం. అయితే దర్యాప్తులు, విచారణలనేవి వివక్ష లేకుండా ఎవరి విషయంలోనైనా ఒకేలా ఉండాలి. ఈ విషయంపైన ఒక జాతీయ టీవీ చానెల్‌లో జరిగిన చర్చ సందర్భంగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ... సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా  న్యాయప్రక్రియ ఒకే తీరులో కొనసాగాలని, అప్పుడే న్యాయాన్ని ఆశించగలమని అన్నారు. సంచలనాత్మకమైన ఇలాంటి ఎన్నో కేసుల విచారణ క్రమాన్ని గమనిస్తే, తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఏసీబీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఎంతో శ్రమించి కోర్టులకు తగిన ఆధారాల్ని సమర్పించిన తర్వాత కూడా... వారు ఆశించిన ఫలితం రాకుంటే ప్రభుత్వాలు అప్పీలుకు వెళ్ళకపోవడం వల్ల శిక్షలు పడే అవకాశం బలంగా ఉన్న కేసులు సైతం నీరుగారుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి’’ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios