హైదరాబాద్: ఓ వ్యాపారిని రూ.11.5 కోట్లకు మోసం చేసిన ప్రేమజంట కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. విజయ్ కుమార్ రెడ్డి, ఆయన ప్రియురాలు స్మృతి సిన్హా అలియాస్ శిరీష వీరారెడ్డి అనే వ్యాపారి నుంచి రూ.11.5 కోట్లు తీసుకుని మోసం చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో విజయ్ కుమార్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను వీరారెడ్డి భార్యకు చివరి ఫోన్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

"అక్కా, నన్ను క్షమించు, మాయలాడి ప్రేమ మైకం నన్ను కమ్మేసింది. ఆ మత్తులో పడి దారి తప్పాను. తేరుకునే లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  నీకు నా ముఖం చూపించలేను. సమాజంలో తలెత్తుకుని తిరగలేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా" అని విజయ్ కుమార్ రెడ్డి వీరారెడ్డి భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు తమ విచారణలో భాగంగా ాడియో కాల్ రికార్డులను పరిశీలించారు. అందులో ఆ విషయం బయటపడింది. 

Also Read: హోటళ్లకే రూ. 40 లక్షలు అద్దె: మాయలేడిపై దిమ్మతిరిగే విషయాలు వెల్లడి

కడప జిల్లాకు చెందిన శిరీష విజయ్ కుమార్ రెడ్డికి హైదరాబాదులో పరిచయమైంది. అది సహజీవనం వరకు వెళ్లింది. ఇద్దరికి కూడా విలాసవంతమైన జీవితం గడపాలనే కోరిక ఉంది. దాంతో విజయ్ కుమార్ రెడ్డిని పావుగా పాడుకుని మోసానికి తెర తీసింది. అప్పటికే ఆమెకు పెళ్లయి, పిల్లలున్నారు. అయితే, వారిని తన అక్క పిల్లలుగా విజయ్ కుమార్ రెడ్డికి చూపించింది. 

విజయ్ కుమార్ రెడ్డి, శిరీష వీరారెడ్డి నుంచి వివిధ పద్ధతుల్లో డబ్బులు లాగేందుకు సిద్ధపడ్డారు. వీరారెడ్డి బావమరిదికి రూ.90 కోట్ల కట్నమిచ్చే అమ్మాయితో సంబంధం కుదురుస్తామని, తక్కువ ధరకు కడపలో పొలాలు కొనడానికి సహకరిస్తామని వీరారెడ్డిని నమ్మించారు. వారిని నమ్మి వారు అడిగినప్పుడు వీరారెడ్డి డబ్బులు ఇస్తూ వెళ్లాడు. రెండేళ్లలో 11.5 కోట్లు లాగారు. 

Also Read: నకిలీ ఐపీఎస్ : పెళ్లి పేరుతో రూ. 11 కోట్లకు టోకరా.. యువకుడి ఆత్మహత్య

శిరీష, విజయ్ కుమార్ రెడ్డిల మోసం స్నేహితుల ద్వారా వీరారెడ్డికి తెలిసింది. దీంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చాడు. అంతేకాకుండా శిరీష పిల్లల విషయంలో తనకు అబద్ధం చెప్పిందని విజయ్ కుమార్ రెడ్డికి అర్థమైంది. దీంతో ఏం చేయాలో తోచక తీవ్రమైన మనస్తాపానికి గురై విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు.  

ఆత్మహత్యకు ముందు వీరారెడ్డి భార్యకు విజయ్ ఫోన్ చేశాడు. వీరారెడ్డి భార్య అతన్ని వారించింది. అయినా విజయ్ కుమార్ రెడ్డి వినలేదు. ఆ కాల్ రికార్డులు సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కాయి.