హైదరాబాద్: తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తెలంగాణ మంత్రి కెటి రామారావు అమ్మనా... బొమ్మనా అంటూ చేసిన వ్యాఖ్యపై తెలంగాణ కాంగ్రెసు నేత వి. హనుమంతరావు భగ్గుమన్నారు. సోనియా గాంధీని అమ్మనా.. బొమ్మనా అని అనడానికి నీకెంత ధైర్యం అని ఆయన కేటీఆర్ ను ప్రశ్నించారు.

ఇలాంటి భాష మాట్లాడితే నీ ఇంటికి వస్తా.. రాకుంటే పేరు మార్చుకుంటా అని విహెచ్ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.  నీ తండ్రి ఆశీర్వాదం వల్లనే నువ్వు మంత్రివయ్యావని అన్నారు. 

నీ తండ్రి (కేసీఆర్) సోనియా కాళ్లకు మొక్కినప్పుడు ఏమైందని అడిగారు. కేసిఆర్ దీక్షల సంగతి తమకు తెలియంది కాదని, తెలంగాణ రావాలని అప్పుడు తాము మౌనంగా ఉన్నామని ఆయన అన్ారు. మీ నాయన దీక్ష చేసినందుకు తెలంగాణ రాలేదని, మాట నిలబెట్టుకోవడానికి సోనియా తెలంగాణ ఇచ్చారని ఆయన కెటిఆర్ ను ఉద్దేశించి అన్నారు.

తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని కెసిఆర్ అన్నారని, ఇప్పుడేమైందని అన్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు, కుటుంబం ఏమయ్యేదని ఆయన అడిగారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తాడో పేడో తేల్చుకుంటామని విహెచ్ హెచ్చరించారు.