ఢిల్లీ: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ, చంద్రబాబును ముగ్గురిని కలిసి ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న అసదుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వారిది ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే అసదుద్దీన్ ది కల్వకుంట్ల కంపెనీయా అంటూ విమర్శించారు. 

టీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్ కు అసదుద్దీన్ స్లీపింగ్ పార్ట్నర్ అంటూ ఎద్దేవా చేశారు. ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ కు అసదుద్దీన్ మద్ధతు ఇస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కు అసదుద్దీన్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం తథ్యమని వీహెచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఆ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ చేసిన మోసాన్ని గ్రహించిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారని తెలిపారు.