హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీరు సృష్టించిన భీభత్సం గురించి మాజీ టీమిండియా ప్లేయర్ యువరాజ్ సింగ్ స్పందించారు. భారీ వర్షాలతో తీవ్ర నష్టాన్ని చవిచూసిన రాష్ట్రం తిరిగి సాధారణ పరిస్థితిలోకి రావాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నానంటూ యువరాజ్ ట్విట్టర్ వేదికన స్పందించారు. 

''తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద నీరు అల్లకల్లోలం సృష్టించింది. వరద నీటి ప్రవాహంతో ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇకపైన ఎలాంటి నష్టం వాటిల్లకూడదని... రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా వుండాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా. వరద నీటిలో చిక్కుుకున్న వారిని కాపాడేందుకు ఫ్రంట్ లైన్ వారియర్స్ అద్భుతంగా పనిచేస్తున్నారు. ఈ వర్షాలు, వరదల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలను మరియు తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు సురక్షితంగా వుండాలని కోరుకుంటున్నా''  అంటూ యువరాజ్ సింగ్ ట్వీట్ చేశారు.

read more  హైద్రాబాద్ పాతబస్తీ అలీనగర్‌లో నాలుగు మృతదేహాలు లభ్యం: మరో నలుగురి కోసం గాలింపు

ఇక తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల 50 మంది వరకు మరణించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 11 మంది వరకు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది.

భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలన్నారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై సీఎం గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వహించారు. కొన‌సాగుతున్న‌ సహాయ, పునరావాస చర్యలను సీఎం సమీక్షించారు. రాబోయే  రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్‌లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జీహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

జీహెచ్ఎంసీలో సహాయ కార్యక్రమాలకు రూ.5 కోట్లతో పాటు మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రతి ఇంటికి 3 రగ్గులతో పాటు నిత్యావసరాలు అందజేస్తామని.. పూర్తిగా కూలిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మత్తులు చేయిస్తామని, నాలాలపై కూలిన ఇళ్లకు బదులు కొత్త ఇళ్లు నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.