హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని అలీనగర్ లో గల్లంతైన  ఎనిమిది మందిలో నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అలీనగర్ లో బుధవారం నాడు సాయంత్రం సహాయం కోసం అరుగుపై కూర్చొన్న ఎనిమిది మంది వరద నీటిలో కొట్టుకుపోయారు.

also read:భారీ వర్షాలతో రూ. 5 వేల కోట్ల నష్టం: రూ. 1350 కోట్లివ్వాలని మోడీకి కేసీఆర్ లేఖ

గురువారం నాడు రాత్రి రెండు మృతదేహాలను ఫలక్‌నుమా సమీపంలో నాలాలో గుర్తించారు. మరో రెండు మృతదేహాలను శుక్రవారం నాడు దొరికాయి.మృతుల్లో ముగ్గురు మహిళలు ఓ బాలిక ఉన్నారు. మరో నాలుగు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మంగళవారం నాడు హైద్రాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. సుమారు 32 సెం.మీ వర్షపాతం నమోదైంది.  దీంతో నగరంలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పాతబస్తీలోని అల్‌జుబైల్ కాలనీ ఇంకా నీటిలో ఉంది. ఆయా ప్రాంతాల్లో సుమారు 250 కుటుంబాలున్నాయి. రెస్క్యూ బృందాలు వారిని బోట్ల సహాయంతో బయటకు తరలించారు. 

వరద నీటితో బయటకు రాకుండా ఇండ్లలోనే ఉన్నవారు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం లేక ఇబ్బందులుపడుతున్నారు.