Asianet News TeluguAsianet News Telugu

టి న్యూస్ సంతోష్ కు బంపర్ ఆఫర్

  • వేములవాడ ఉప ఎన్నిక తప్పదన్న భావనలో టిఆర్ఎస్
  • సంతోష్ రావును బరిలోకి దింపేందుకు కేసిఆర్ ప్లాన్
  • ఇప్పటి వరకు తెర వెనుకే సంతోష్ ప్రయాణం
  • ఆరేడు నెలలుగా మెల్ల మెల్లగా తెర మీదకు వస్తున్న సంతోష్
Vemulawada bumper offer for t news santosh

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికల రానుంది. రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి ఇప్పటి వరకు అనేక ఉప ఎన్నికలు వచ్చాయి. అందులో ప్రస్తుత సంగారెడ్డి జిల్లాకు చెందిన నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేగా ఉన్న పి.కిష్టారెడ్డి మరణించారు. దీంతో అక్కడ జరిగిన ఉపఎన్నికలో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచింది. అలాగే ఖమ్మం జిల్లాలోని పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మరణించగా అక్కడ కూడా ఉప ఎన్నిక వస్తే టిఆర్ఎస్ తరుపున మంత్రి తుమ్మల పోటీ చేసి గెలుపొందారు. ఈ రెండుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరణించారు. గెలిచింది మాత్రం టిఆర్ఎస్ పార్టీ.

ఇక వరంగల్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కడియం శ్రీహరి మంత్రిగా అయిన తర్వాత ఎంపి సీటుకు రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరిగిన ఎన్నికలో మళ్లీ  టిఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపొందారు. ఇదంతా చరిత్ర. టిఆర్ఎస్ మంచి ఊపుమీద ఉండడంతో అక్కడ ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది.

ఇక మరో ఉప ఎన్నిక తెలంగాణలో తప్పేలాలేదు. అదెక్కడంటే వేములవాడ స్థానానికి. ఇక్కడి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు భారత పౌరసత్వం రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆయన మళ్లీ అప్పీల్ చేస్తానని ప్రకటించారు. కానీ అప్పీల్ అనేది అయ్యే పనికాదని తెలుస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకే కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించినందున చెన్నమనేని అప్పీల్ ను కేంద్రం తోపిపుచ్చే చాన్సే ఉందంటున్నారు.

చెన్నమనేని తప్పుడు పత్రాలు సమర్పించారని, ఆయన ఇండియన్ సిటిజన్ కాదని అప్పట్లో చెన్నమనేని మీద పోటీ చేసిన ఆది శ్రీనివాసులు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేసి పోరాడి విజయం సాధించారు. ఈనేపథ్యంలో తన పౌరసత్వంతోపాటు ఎమ్మెల్యే సభ్యత్వం కూడా రమేష్ వదులుకోవాల్సివచ్చింది. దాంతోపాటు ఆయన తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల సంఘాన్ని తప్పదోవపట్టించినందుకు ఆయనపై ఏరకమైన చర్యలు తీసుకుంటారన్నది కూడా చర్చనీయాంశమైంది.

వేములవాడ ఉప ఎన్నిక అనివార్యమైందని అన్ని రాజకీయ పార్టీలు అంచనాకు వచ్చాయి. దీంతో అక్కడినుంచి టిఆర్ఎస్ తరుపున ఇప్పటికే అభ్యర్థి కూడా ఖరారైపోయారు. కేసిఆర్ అంతరంగికుడు, ఆయనకు పిఎగా పనిచేసి, ప్రస్తుతం టిన్యూస్ చానల్ కు ఎండిగా ఉన్న జోగినిపల్లి సంతోష్ రావును అక్కడి నుంచి పోటీ చేయించే అవకాశాలున్నట్లు టిఆర్ఎస్ వర్గాల్లో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

కేసిఆర్ అంతరంగికుడిగా ఉన్న సంతోష్ ఏనాడూ తెర వెనుక మాత్రమే ఉన్నారు తప్ప తెర మీదకు రాలేదు. ఆయన కేసిఆర్ కు కొడుకు వరుస అవుతారు. కానీ గత ఆరేడు నెలలుగా సంతోష్ తెర మీద ప్రత్యక్షమవుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

ఇదంతా కేసిఆర్ డైరెక్షన్ మేరకేనన్న ప్రచారం కూడా పార్టీలో ఉంది. ఇటీవల సంతోష్ వేములవాడ వెళ్లిన సందర్భంలో మీడియాలో భారీగా హడావిడి చేశారు. ఏ ఎమ్మెల్సీగా రాజకీయాల్లోకి వస్తారనుకుంటే ఇలా ఎమ్మెల్యేగానే బరిలోకి దిగే చాన్స్ రావడం పట్ల టిఆర్ఎస్ శ్రేణుల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.

తెలంగాణ సర్కారు చేపట్టిన భారీ కార్యక్రమం హరితహారంలో సంతోష్ అత్యత కీలకంగా వ్యవహరించారు. టిన్యూస్ ప్రత్యేక కాంపెయిన్ చేసింది. ప్రతిచోటా సంతోష్ బొమ్మతో కూడిన బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెరమీదకు వచ్చే క్రమంలోనే ఈ హడావిడి జరిగిందని చెబుతున్నారు.

ఇదే కాకుండా మంత్రి కేటిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఆశ్రమానికి సంతోష్ 6లక్షల రూపాయలు తన సొంత డబ్బు విరాళంగా అందజేశారు. దాన్ని ప్రచారంలో కూడా పెట్టారు.

దీంతోపాటు సంతోష్ సొంత ఊరు వేములవాడ నియోజకవర్గానికి ఆనుకొని చొప్పదండి నియోజకవరగ్ంలో ఉంటుందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు వేములవాడలో టిఆర్ఎస్ కు బలమైన అభ్యర్థి కూడా లేకపోవడం సంతోష్ కు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

మరోవైపు ఎవరినో  నిలబెట్టి అవస్థలు పడే కంటే సంతోష్ ను అక్కడినుంచి పోటీ చేయించేడంతో గెలుపు సులువు అవుతుందని సిఎం భావిస్తున్నట్లు కూడా చెబుతున్నారు.

మరోవైపు వేములవాడలో వెలమ సామాజికవర్గం ఓటింగ్ భారీగా ఉంటుందని చెబుతున్నరు. అందుకే అక్కడ గతంలో అన్ని పార్టీలు వెలమ సామాజికవర్గం వారినే బరిలోకి దింపుతాయి.

మొత్తానికి అతి కొద్దిరోజుల్లోనే టిన్యూస్ ఎండి సంతోష్ రావు అసెంబ్లీలో అధ్యక్షా అనడం ఖాయమని టిఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios