ఈసారి కూడా నకిరేకల్ బిఆర్ఎస్ టికెట్ తనకు దక్కుతుందని భావించి భంగపడ్డ మాజీ ఎమ్యెల్యే వేముల వీరేశం సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు.
విజయవాడ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రకటన బిఆర్ఎస్ పార్టీలో అలజడి రేపింది. ఈసారి బిఆర్ఎస్ టికెట్ తమకే వస్తుందని ఆశించి భంగపడ్డ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులకు టికెట్ దక్కకున్నా భవిష్యత్ లో మంచి అవకాశాలిస్తామన్న అధిష్టానం భరోసా లభించింది. కానీ మరికొందరు నాయకులను బిఆర్ఎస్ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు.
గత ఐదేళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిరాదరనకు గురయ్యానని... సీఎం కేసీఆర్ తనను అసలు మనిషిగానే చూడలేదంటూ వీరేశం ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యమకాలం నుండి కేసీఆర్ వెన్నంటే వున్నానని... అయినా తనకు పార్టీలో అన్యాయమే జరిగిందన్నారు. తనపైనే కాదు అనుచరులపైనా అక్రమ కేసులు పెట్టి వేధించినా ఏనాడూ సీఎం స్పందించలేదని అన్నారు. సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ పెద్దల తీరుతో గత ఐదేళ్ళుగా మానసిక వేదన అనుభవిస్తున్నానని వీరేశం ఆవేదన వ్యక్తం చేసారు.
ఎన్ని అవమానాలు ఎదురయినా సైలెంట్ గా బరిస్తూ వచ్చానని... ఇక ఓపిక నశించిందని వేముల వీరేశం అన్నారు. అందువల్లే బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. దయనీయ పరిస్థితిలో పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వేముల వీరేశం తెలిపారు.
Read More ఆరునూరైనా ప్రజా జీవితంలోనే ఉంటా: తేల్చేసిన తాటికొండ
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుండి పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే వీరేశం స్పష్టం చేసారు. అయితే ఏ పార్టీలో చేరాలన్నదానిపై సన్నిహితులు, అనుచరుల అభిప్రాయాలు తీసుకుంటున్నానని... త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వేముల వీరేశం తెలిపారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థిగా నకిరేకల్ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు వేముల వీరేశం. ఆయనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బిఆర్ఎస్ పార్టీలో చేరాడు. దీంతో నకిరేకల్ లో వీరేశం హవా తగ్గింది. అయినప్పటికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ టికెట్ తనకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే భావించాడు. కానీ కేసీఆర్ సిట్టింగ్ లకే టికెట్ కేటాయించడంతో వీరేశం ఆశలు గల్లంతయ్యాయి. దీంతో అదిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇవాళ సన్నిహితులు, అనుచరులతో వీరేశం సమావేశమయ్యారు.
ఇక బిఆర్ఎస్ లో కొనసాగి లాభం లేదని ... కాంగ్రెస్ లో చేరాలని వేముల వీరేశం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే అభిప్రాయాన్ని అనుచరులు కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన వీరేశం కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేల్లో వీరేశానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది.దీంతో వీరేశానికి కాంగ్రెస్ పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందంటూ చర్చ సాగుతుంది.
