హైదరాబాద్:ప్రధానమంత్రి మోడీ హత్యకు కుట్ర పన్నారనే కేసులో పూణె పోలీసులు  మంగళవారం నాడు విరసం నేత వరవరరావును హైద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రని మోడీని మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తరహాలోనే హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారనే లేఖను పూణె పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.ఈ మేరకు నమోదైన కేసులో  వరవరరావును మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.

                          "

ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రకు సంబంధించిన లేఖలో ప్రముఖ విప్లవ కవి వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. పూణే పోలీసులకు చిక్కిన ఐదుగురు మావోయిస్టుల్లో జాకబ్ విల్సన్ రాసిన లేఖలో వరవరరావు పేరున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ మేరకు ఈ ఏడాది జూన్ 8వ తేదీన పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకొన్నారు. రోనా జాకబ్ విల్సన్ ను పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసిన సందర్భంగా ఈ లేఖ విషయం వెలుగు చూసింది.

నక్సలైట్ సానూభూతి పరులతోనూ, కవి వరవరరావుతోనూ మాట్లాడినట్లు కామ్రేడ్ ఎం పేరు మీద రాసి లేఖలో ఉంది. ఆ విధమైన దాడులు చేయడానికి వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్  మార్గదర్శనం చేస్తారని ఆ లేఖలో ఉంది. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో సురేంద్ర గాడ్లింగ్ ఉన్నారు లేఖలో ప్రస్తావనకు రావడంతో పూణే పోలీసులు వరవరరావు ఇంట్లో మంగళవారం నాడు సోదాలు నిర్వహించారు.

విల్సన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో ఎం4 రైఫిల్ ను, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేయడానికి 8 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాసి ఉందని ఆ లేఖలో పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే  వరవరరావు ఖండించారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని వరవరరావు అన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్ తో తనకు సంబంధం లేదని చెప్పలేనని వరవరరావు అన్నారు.

రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాటం చేస్తున్నవారిని టార్గెట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. తనను, విల్సన్ ను అరెస్టు చేయడానికే ఈ కుట్ర అని ఆయన అన్నారు. ప్రధాని మోడీపై దాడి చేసేంత శక్తి మావోయిస్టులకు ఉందా అనేది అనుమానమని ఆయన అన్నారు. 

ఈ లేఖకు సంబంధించి ఇప్పటికే  మహారాష్ట్రలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాడు ఉదయం నుండి వరవరరావు నుండి పూణె పోలీసులు వరవరరావుతో పాటు ఇద్దరు జర్నలిస్టులు కూర్మనాథ్, టేకుల క్రాంతి,  ఇఫ్లూ ప్రోఫెసర్ సత్యనారాయణ ఇంట్లో  సోదాలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా  మరో నలుగురి ఇళ్లలో కూడ సోదాలు నిర్వహించారు. 

వరవరరావును అరెస్ట్ చేసిన తర్వాత  గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను నాంపల్లి కోర్టులో హజరుపర్చారు. బుధవారం నాడు ఉదయం పూణె కోర్టులో హాజరుపర్చాలని  కోర్టు పోలీసులను ఆదేశించింది.

 

ఈ వార్తలు చదవండి

పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు