విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశాలకు చేర్చేందుకు భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దుబాయి వంటి దేశాల్లో ఇరుక్కుపోయిన భారతీయులను దేశానికి తీసుకురాగా.. ఈ రోజు ఉదయం యూకే నుంచి దాదాపు 331మంది ఇండియన్స్ హైదరాబాద్ చేరుకున్నారు.

‘వందే భారత్’ మిషన్ కింద విదేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం తెల్లవారుజామున యూకే నుంచి ఢిల్లీ మీదుగా ఒక విమానం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. యూకేలో చిక్కుకుపోయిన 331 మంది భారతీయులతో తెల్లవారుజామున 2.21 గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 

ఇదే విమానం తిరిగి తెలంగాణలో చిక్కుకుపోయిన 87 మంది అమెరికా జాతీయులను తీసుకుని ఉదయం 5.31 గంటల సమయంలో ఢిల్లీకి తిరిగి వెళ్లింది. అమెరికా జాతీయులను తిరిగి ఢిల్లీ నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు పంపుతారు.

యూకే నుంచి వచ్చిన భారతీయులు, అమెరికా వెళ్లే ప్రయాణికుల కోసం విమానాశ్రయంలో ఎయిరో బ్రిడ్జి నుంచి అరైవల్స్ ర్యాంప్ వరకు పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేషన్ చేశారు. దీంతో పాటు విమానాశ్రయంలోని వాష్ రూంలు, కుర్చీలు, కౌంటర్లు, ట్రాలీలు, రెయిలింగులు, లిఫ్టులు, ఎస్కలేటర్లు మొదలైనవాటిని కూడా శానిజైట్ చేశారు. 

ఎయిరో బ్రిడ్జి నుంచి బయటికి వచ్చేంత వరకు ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది సామాజిక దూరాన్ని పాటించారు. ఇక విమానాశ్రయంలోకి ప్రయాణికులను 20-25 మందితో ఒక బృందంగా చేసి తీసుకువచ్చారు. ఇమిగ్రేషన్ నిబంధనలకు పూర్తి చేయడానికి ముందు ఎయిర్‌పోర్ట్ హెల్త్ అధికారులు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శాకల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి థర్మల్ కెమెరాల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించారు. 

స్క్రీనింగ్ అనంతరం, సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వారిని ఇమిగ్రేషన్ క్లియరెన్స్ కోసం తీసుకువెళ్లారు. ప్రయాణికులు, ఇమిగ్రేషన్ సిబ్బంది మధ్య ఎడబాటు ఉండేందుకు ఇమిగ్రేషన్ కౌంటర్ల వద్ద గ్లాస్ షీల్డులను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటర్ వద్ద సామాజిక దూరం నిబంధనలు పాటించారు. ఎయిరిండియా గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బంది, ఎయిర్ పోర్ట్ సిబ్బంది ప్రయాణికులు సామాజిక దూరం నిబంధనలు పాటించడంలో సహకరించారు.

 ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను నగరంలో ముందుగా గుర్తించిన ప్రదేశాలకు 14 రోజుల తప్పనిసరి క్వారంటైన్‌కు తరలించారు. ప్రయాణికులు తరలివెళ్లిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ను మరొకసారి పూర్తిగా శానిటైజ్, ఫ్యూమిగేట్, డిస్‌ఇన్ఫెక్ట్ చేశారు. ఇప్పటి వరకు దాదాపు 750మంది భారతీయులను విదేశాల నుంచి స్వదేశానికి తీసుకువచ్చారు.