పెద్దపల్లి:  లాయర్ దంపతుల హత్యతో టీఆర్ఎస్ నేత, ప్రస్తుత జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు చిక్కుల్లో పడినట్లు కనిపిస్తున్నారు. వామన్ రావు దంపతులది రాజకీయ కుట్రగా ముందుకు వచ్చింది. పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను పాత్ర బయటపడడంతో లాయర్ దంపతుల హత్య రాజకీయమైన మలుపు తీసుకుంది. వామన్ రావు దంపతుల హత్య పుట్ట మధుకు తెలిసి జరిగిందా, తెలియకుండానే జరిగిందా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

వామన్ రావు దంపతుల హత్య పుట్ట మధుకు తెలియకుండా జరిగినట్లు అర్థమవుతోంది. కుంట శ్రీను, బిట్టు శ్రీను మధ్య జరిగిన సంభాషణ ఆడియో బయటపడడంతో పుట్ట మధు తెలియకుండా జరిగిందని భావిస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారని పుట్ట మధు వామన్ రావుపై ఆగ్రహం ఉంది. అయితే, పుట్ట మధు తన మామను ఇబ్బంది పెట్టేవారిని లక్ష్యం చేసుకుంటాడని అంటున్నారు. 

కాంగ్రెసు నాయకుడు ఇనుముల సతీష్ ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడిన విషయాలు పుట్ట మధు పాత్రపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పుట్ట మధు నలుగురిని లక్ష్యంగా చేసుకున్నారని, అందులో ఒకరిని తన వైపు తిప్పుకున్నారని ఆయన చెప్పారు. నలుగురిలో వామన్ రావు, నాగమణి దంపతులు హతమయ్యారని, మిగిలింది తాను ఒక్కడేనని ఆయన అన్నారు. తాను సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నానని చెప్పారు. తాను రెండేళ్ల క్రితమే తనకు ప్రాణహాని ఉందని డీజీపీకి, ఇతర పోలీసు అధికారులకు విన్నవించుకున్నానని, ఆయనా తనకు రక్షణ కల్పించలేదని ఆయన అన్నారు. 

తనపై కక్ష పెంచుకున్న పుట్ట మధు ఆర్థికంగా తనను కష్టాలు పెట్టారని, దుకాణం లైసెన్స్ రద్దు చేయించారని, తనకు వచ్చే వికలాంగుల పింఛనును రద్దు చేయించారని ఆయన ఆరోపించారు. తనను అంతమొందించాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తనను చంపడానికి ముఠాకు సుపారీ ఇచ్చిన విషయం కుంట శ్రీను, బిట్టు శ్రీను సంభాషణల్లో బయటపడిందని ఆయన చెప్పారు. ఈ కేసు ఇంకా కోర్టులో నడుస్తోందని ఆయన చెప్పారు. 

2014లో పుట్ట మధు ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజే తన ఇంటిపై బిట్టు శ్రీను దాడి చేశాడని, తాను ఆ సమయంలో దొరకలేదని, కానీ ఇంట్లో విధ్వంసం సృష్టించారని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై హైకోర్టులో కేసు వేసినందుకు, సమాచార హక్కు చట్టం ద్వారా పోరాటం చేస్తున్నందుకు పుట్ట మధు తనను లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన ఆరోపిచారు. 2018లో ఎన్నికలకు ముందు తనపై దాడి జరిగిందని ఆయన చెప్పారు. 

కాగా, పుట్ట మధు సోదరుడి కూతురి ప్రేమ వివాహం కూడా పుట్ట మధుకు, వామన్ రావుకు మధ్య విభేదాలకు దారి తీసినట్లు తెలుస్తోంది. పుట్ట మధు సోదరుడి కూతురు ప్రేమ వివాహానికి వామన్ రావు సహకరించారు. దీంతో కూడా పుట్ట మధు వామన్ రావుపై కక్ష పెంచుకున్నట్లు భావిస్తున్నారు. నియోజకవర్గంలో పుట్ట మధు అవినీతిపై న్యాయ పోరాటాలు చేయడమే వామన్ రావు హత్యకు దారి తీసినట్లు విమర్శలు వస్తున్నాయి. గ్రామంలో వివిధ విషయాల్లో వామన్ రావుకు, కుంట శ్రీనుకు మధ్య విభేదాలున్నాయి. దీంతో కుంట శ్రీను, బిట్టు శ్రీను పథకం ప్రకారం వామన్ రావు దంపతులను హత్య చేసినట్లు భావిస్తున్నారు.